శరీరం పై పచ్చబొట్లు వేయించుకోవడం మామూలే. కానీ గంట కాదు రెండు గంటలు కాదు ఏకంగా 2వేల గంటలు కూర్చొని ఒళ్లంతా టాటూలు వేయుంచుకున్నారో జంట. పైగా ఇలా వేయించుకున్న వృద్ధ జంటగా కూడా వీరు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు.
ఒకరిపై ప్రేమతో పచ్చబొట్టు వేయించుకోవడం చూశాం. కొందరు ప్రేమతో, ఇతర కారణాల వల్లనో పచ్చబొట్టు పొడిపించుకుంటారు. కానీ అదే పనిగా కూర్చొని ఒళ్లంతా పొడిపించుకోవడానికి ఎవరైనా సిద్ధమవుతారా? పిచ్చిగా అనిపించినా కానీ యూఎస్ లోని ఒక వృద్ధ జంట మాత్రం 2000 గంటలు కూర్చొని టాటూలు వేయించుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక టాటూలు వేయుంచుకున్న జంటగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ల్లో తమ పేరు నమోదు చేసుకున్నారు.
ప్రత్యేకమైన రికార్డు..
ఫ్లోరిడాకు చెందిన చక్ హెల్మ్కే, షార్లెట్ గుటెన్ బర్గ్ తమను తాము కదిలే ఆర్ట్ గ్యాలరీగా పిలుచుకుంటారు. వారి శరీరం 90శాతం కంటే ఎక్కువ పచ్చబొట్టు కప్పేసి ఉన్నాయి. ఇందులో చక్ హెల్మ్కే వయసు 81, షార్లెట్ గుటెన్ బర్గ్ వయసు 74 యేండ్లు. 98శాతం షార్లెట్, 97శాతం చక్ తమ ఒంటి మీద టాటూలను వేయించుకున్నారు. ఇందులో షార్లెట్ తలపై అత్యధిక టాటూలను కలిగి ఉన్న సపరేట్ రికార్డును కలిగి ఉంది. అయితే ఈమె 50 యేండ్లు వచ్చేవరకు ఒంటి మీద ఒక పచ్చబొట్టు కూడా వేయించుకోకపోవడం ఇక్కడ విశేషం.
అక్కడే పరిచయం..
చక్, షార్లెట్ పరిచయం కూడా చాలా విచిత్రంగా జరిగింది. చక్ ని మొదటిసారిగా టాటూ పరిచయ సెషన్స్ ల్లోనే కలుసుకున్నది. అక్కడ ఈ టాటూలు ఎంత బాధిస్తాయో తెలిపేందుకు సెషన్స్ నిర్వహిస్తారు. అయితే ఆ నొప్పి తెలియకుండా ఉండాలంటే తన చెయ్యి పట్టుకొమని సలహా ఇచ్చాడు చక్. అలా వారి బంధం బలపడింది. త్వరలోనే వీరి బంధం కలిసి ఉండేలా చేసింది. ఈ జంట ఇలా ఒక రికార్డును నెలకొల్పడమే కాదు.. చక్ శరీరం పై 376 పుర్రె బొమ్మలు వేయించుకున్నాడు. ఇలా వేయించుకున్న మొదటి వ్యక్తి ఇతడే. అలాగే షార్లెట్ 216 ఈకల చిత్రాలను టాటూలుగా వేయించి ప్రత్యేకమైన రికార్డు కలిగి ఉంది. ఈ జంటను ఇప్పుడంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.