ఇటీవల అమెరికా సమీపంలో దక్షిణ కరోలినా సముద్ర తీరప్రాంత గగనతలంపై ఎగురుతున్న చైనా దేశానికి సంబంధించిన గుర్తుతెలియని వస్తువును అమెరికా సైన్యం పేల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా కెనడా గగనతలంలో ఎగురుతున్న మరో వస్తువును అమెరికా యుద్ధవిమానం కూల్చివేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆమోదం మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. తర్వాత ఆరురోజులకు అలస్కా గగనతలంలో మరో అనుమానిత వస్తువును సైతం కూల్చివేసింది.
కెనడా గగనతలంపై చక్కర్లు కొడుతున్న బెలూన్ లాంటి ఓ అనుమానాస్పద వస్తువును అమెరికా ఫైటర్ జెట్ F-22 పేల్చివేసింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదేశాల మేరకు అమెరికా, కెనడా వాయుసేనలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఆ అనుమానాస్పద శకలాలు యూకాన్‌లో పడ్డాయని..వాటిని పరిశీలించనున్నట్టు తెలిపారు ట్రూడో.
అంతకుముందు అలాస్కా తీరప్రాంత గగనతలంలో ఎగురుతున్న గుర్తుతెలియని వస్తువును కూల్చివేసినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ శుక్రవారం ప్రకటించింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశానుసారం ఈ చర్యను చేపట్టినట్లు తెలిపింది. ఇలా రెండు రోజుల వ్యవధిలో రెండు వస్తువులను అమెరికా కూల్చివేయడం గమనార్హం. వారం క్రితం చైనాకు చెందిన ఓ గూఢచర్య బెలూన్‌ను సైతం అమెరికా కూల్చివేసిన విషయం తెలిసిందే.