బట్టలు మడత బెట్టి రికార్డు కొట్టచ్చని నిరూపించాడు డేవిడ్ రష్. ఒక నిమిషంలో అత్యధిక టీ షర్టులను మడత పెట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ప్రతిభావవంతులైన వ్యక్తులు సృష్టించిన ఆసక్తికరమైన ప్రపంచ రికార్డులను మనం చూస్తుంటాం. కొన్ని శారీరక, బలం, చురుకుదనం వంటి నైపుణ్యాలపై ఆధారపడి ఉంటాయి. డేవిడ్ నిమిషంలో 31 టీ షర్టులను మడతపెట్టాడు. గతంలో అతను 23 టీ షర్టులు మడత పెట్టిన రికార్డును అతనే బద్దలు కొట్టాడు. అతను స్టెమ్ (సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) విద్యను ప్రోత్సహించడానికి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టడంలో ప్రసిద్ధి చెందాడు. గతంలో అతనే ఒక నిమిషంలో అత్యధిక టీ షర్టులను వేలాడదీసి, ధరించిన రికార్డులను సంపాదించాడు. ప్రస్తుతం అత్యధిక టీ షర్టులను మడత పెట్టాలని భావించాడు.
రికార్డు కోసం..
యూఎస్ఏ నివాసి అయిన డేవిడ్ తాను మడత పెట్టడానికి వేగవంతమైన మార్గాన్ని కనుగొన్నాడు. వివిధ పద్ధతుల్లో ప్రయోగాలు చేశానని చెప్పాడు. డేవిడ్ ఒక చేయి లోపలికి మడత పెట్టి, ఆ పై మరొకటి, దిగువన మడత పెట్టడం, చివరగా టీ షర్టులను మడవడానికి అత్యంత వేగవంతమైన పద్ధతి అని నిర్ధారించాడు. ఈ టెక్నిక్ నిజానికి అతనికి మునుపటి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టడానికి, సరికొత్త రికార్డు సెట్ చేయడానికి సహాయపడింది.
కొత్తేం కాదు..
డేవిడ్ 250 కంటే ఎక్కువ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ టైటిల్స్ కలిగి ఉన్నాడు. అతను గతేడాది ఒక్కో వారానికి ఒక్కో రికార్డు చొప్పున టైటిల్స్ ని క్లెయిమ్ చేశాడు. అందులో హాఫ్ మారథాన్స్, 111 టీ షర్టులు ధరించడం, గిటార్ పట్టుకొని గడ్డం మీద నడవడం, గాలిలో ఎక్కువ సేపు బెలూన్ లను ఆపడం, 150 కొవ్వొత్తులను వెలిగించి నోటిలో ఎక్కువ సేపు ఉంచుకొని రికార్డు సృష్టించాడు. అంతేకాదు.. 16 సెకన్లలో హ్యాంగరుకు 5 టీ షర్టులను వేలాడదీసినందుకు ప్రపంచ రికార్డును కొట్టాడు. వచ్చే ఏడాది మరిన్ని రికార్డులు కొట్టడానికి రెడీగా ఉన్నానంటున్నాడు.