ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక అండ.. మూడో ప్రపంచ యుద్ధం రానుందా? - MicTv.in - Telugu News
mictv telugu

ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక అండ.. మూడో ప్రపంచ యుద్ధం రానుందా?

April 16, 2022

amerika

రష్యా – ఉక్రెయిన్‌ల మధ్య 50 రోజులుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. చాలా చిన్న దేశమైన ఉక్రెయిన్ సైనికంగా అత్యంత బలమైన రష్యాను ఎదుర్కొని ఇన్ని రోజులు ఎలా పోరాడగులుగుతుందీ అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సమాధానం అమెరికా, మరికొన్ని యూరప్ దేశాలు. యుద్ధం మొదలైనప్పటి నుంచీ ఈ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు, డబ్బులు, ఇతరత్రా విషయాల్లో చాలా సహాయం చేశాయి, చేస్తున్నాయి. దీంతోపాటు జెలెన్ స్కీ భయపడి దేశం విడిచి పారిపోకుండా మనో ధైర్యాన్ని ఇచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా, నాటో దేశాలు ఇచ్చిన ఆయుధ వ్యవస్థలతో ఉక్రెయిన్ మొన్న రష్యన్ యుద్ధ నౌకను ధ్వంసం చేసింది. దీంతో రష్యా ఆగ్రహంతో రగిలిపోతోంది. రష్యన్ ప్రభుత్వ మీడియాలోని ఓ యాంకర్ మాట్లాడుతూ.. ఈ చర్యతో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైందని వ్యాఖ్యానించింది. ఇప్పటివరకూ ఉక్రెయిన్‌పై ప్రత్యేక సైనిక చర్య అంటూ చెప్తూ వస్తున్న రష్యా ఇలా స్వరం మార్చడం వెనుక కారణం ఉంది. యుద్ధనౌకను ధ్వంసం చేసే టెక్నాలజీని అమెరికా దాని మిత్ర దేశాలు ఉక్రెయిన్‌కు ఇచ్చాయని రష్యా బలంగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలో యాంకర్ నోటి వెంట మూడో ప్రపంచ యుద్ధం మాట వెలువడింది.

ఈ క్రమంలో రష్యా ఇక నుంచి తన శక్తిసామర్ధ్యాలను పూర్తిగా వినియోగించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని ముందే పసిగట్టిన అమెరికా.. ఎలాగైనా రష్యాను పతనం దిశగా తీసుకెళ్లాలన్న దురుద్దేశంతో అందివచ్చిన అవకాశాన్ని వాడుకుంటోంది. తాజాగా ఉక్రెయిన్‌కు సైనికపరంగా అత్యాధునిక ఆయుధాలు, నిధులు విడుదల చేసింది. 80 కోట్ల డాలర్ల ఆయుధ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో రష్యాపై దాడులకు అవసరమయ్యే రాడార్లు, క్షిపణులు, మందుగుండు సామాగ్రి, యుద్ధ ట్యాంకులు, వందల సంఖ్యలో వాహనాలు వంటివి ఉన్నాయి. వీటితోపాటు 11 ఎంఐ – 17 హెలికాప్టర్లనూ పంపించనుంది. అంతేకాక, వీటిని ఎలా వాడాలో ఉక్రెయిన్ సైనికులకు యుద్ద ప్రాతిపదికన శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ వెల్లడించారు. దీంతో రష్యా – అమెరికాల మధ్య ఇన్నాళ్లూ జరుగుతూ వస్తున్న ప్రచ్ఛన్న యుద్ధం కాస్తా ఉక్రెయిన్ వేదికగా పీక్ స్టేజీకి వెళ్లినట్టయింది. ఇక మిగిలింది ప్రత్యక్ష యుద్ధమే. కాగా, ఇప్పటివరకు జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు యూరప్ కేంద్రంగానే జరిగాయి. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం కూడా అక్కడినుంచే మొదలయ్యే అవకాశాలున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీ స్పందనను కామెంటు రూపంలో తెలియజేయండి. సేకరణ, వ్యాసకర్త : జె. రవీందర్ నాయక్