అందం అనేది ఆడవారి పేటెంట్ అని భావిస్తారు చాలా మంది. పైబడుతున్న వయసును తగ్గించుకునేందుకు వివిధ లోషన్లు, క్రీములు రాస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మగవారు సాధారణంగా వీటికి దూరంగా ఉంటారు. ఏదో గ్లామర్ రంగంలో ఉన్నవారికి అయితే తప్పవనుకోండి అది వేరే విషయం. కానీ ఇక్కడ ఓ మిలీయనీర్ ఏకంగా యవ్వనంగా కనపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. వయసు ఉన్నప్పుడు సంపాదనకే సరిపోయిందని, ఇప్పుడు డబ్బు వచ్చాక వయసు లేదని బాధపడుతూ కూర్చోకుండా వైద్యశాస్త్రంలో కొత్త ప్రయోగానికి దిగాడు. అందుకు ఒక్క ఏడాదిలో 16 కోట్లకు పైగా రూపాయలను ఖర్చు చేస్తూ పందులపై చేయాల్సిన ప్రయోగాలను సొంత శరీరంపై చేయించుకుంటున్నాడు. ఇతనికి ఇలాంటి ఆలోచనలే ఉన్న మరో వ్యక్తి సహకారం అందిస్తున్నాడు.
అమెరికాకు చెందిన బ్రయాన్ జాన్సన్ అనే 45 ఏళ్ల వ్యక్తి ఏకంగా 18 ఏళ్ల యువకుడిలా కనిపించేందుక తెగ ప్రయత్నించేస్తున్నాడు. శరీరం 18 ఏళ్లు, గుండె 37 ఏళ్ల వ్యక్తిలా, చర్మం 28 ఏళ్ల వ్యక్తిలా పలు రకాల చికిత్సలు తీసుకుంటున్నాడు. ప్రతీరోజు 30 మంది డాక్టర్లు 29 ఏళ్ల జోల్మాన్ నాయకత్వంలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో అధిక ఖర్చుతో యాంటీ ఏజింగ్ కోసం ప్రయత్నిస్తున్న తొలివ్యక్తిగా జాన్సన్ రికార్డు సృష్టించాడు. వీటితో పాటు బ్రెయిన్, లివర్, లంగ్స్, పళ్లు, జుట్టు, మర్మాంగాలు కూడా 18 ఏళ్ల వయసు వ్యక్తిగా మార్చుకునే ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనిపై జాన్సన్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగంలో తన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడినా పట్టించుకోనని, ఒకవేళ సక్సెస్ అయితే యవ్వనం రావడంతో పాటు అలాంటి సదుపాయం మానవాళికి అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. చూద్దాం మరి ఏం జరుగనుందో.