అరుణాచల్ ప్రదేశ్ విషయమై డ్రాగన్ కంట్రీ చైనా ఎన్నో ఏళ్లుగా మనదేశంతో గొడవకు దిగుతోంది. అరుణాచల్ తమ దేశంలో భాగమే అంటూ అడ్డదిడ్డంగా వాదిస్తోంది. భారత్ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. చాలా సార్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించింది. ఇరు దేశాల సైన్యాల మధ్య ఘర్షణ కూడా జరిగింది. ఈ క్రమంలోనే అమెరికా భారత్‌కు మద్దతుగా నిలిచింది. మెక్‌మహాన్ రేఖకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు యూఎస్ సెనెట్‌లో ఓ తీర్మానాన్ని కూడా పాస్ చేసింది.
ఆ తీర్మానం ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్ ఇండియన్ భూభాగంలోనే ఉన్నట్లు పేర్కొన్నది. మెక్‌మహాన్ రేఖను అరుణాచల్ ప్రదేశ్, చైనా మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తున్నట్టు వెల్లడించింది. ఇండో పసిఫిక్ ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించాలని చైనా చూస్తోందని, ఇలాంటి సమయంలో వ్యూహాత్మక మైత్రి ఉన్న దేశాలతో అమెరికా మద్దతుగా నిలవాల్సిన అవసరముందని, ముఖ్యంగా భారత్‌కు తప్పకుండా అండగా ఉండాలని భావిస్తున్నట్లు అమెరికా సేనేటర్ బిల్ హగేర్టి తెలిపారు
లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద చైనా సైన్యం చేస్తున్న దుశ్చర్యలను ఖండిస్తున్నామని, తమ తీర్మానం ద్వారా ఇండియాలోనే అరుణాచల్ ప్రదేశ్ ఉన్నట్లు స్పష్టం చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇటీవల రెండు దేశాల సరిహద్దుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. మెక్‌మోహన్ లైన్‌ను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.