US signs arms deal with Taiwan
mictv telugu

తైవాన్‌తో అమెరికా భారీ ఆయుధ డీల్.. విలువ రూ. 8,768 కోట్లు

September 3, 2022

చైనా – తైవాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. యుద్దానికి అవసరమైన ఆయుధాలను విక్రయించేందుకు నిర్ణయించింది. దీని విలువ రూ. 8,768 కోట్లు కాగా, ఇందులో నౌకల విధ్వంసక ఆయుధాలు, గగనతలం నుంచి గగనతలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే క్షిపణులు ఉన్నాయి. ఇప్పటికే 862 కోట్ల రూపాయల మిలటరీ – సాంకేతిక సహాయాన్ని అందించడానికి అమెరికా విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఈ ఏడాది అమెరికా తైవాన్‌తో నాలుగు సార్లు ఆయుధాలు విక్రయించే ఒప్పందాలు చేసుకున్నట్టయింది. అటు తాజా డీల్‌పై చైనా ఘాటుగా స్పందించింది. ఇందుకు ప్రతిగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ చర్యను తమ దేశం వ్యతిరేకిస్తోందని అమెరికాలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి లియు పెంగ్యు పేర్కొన్నారు. ఇది చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడమేనని, భద్రతాపర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.