బ్యాగులో 6 రోజుల పసికందు.. మహిళ అరెస్ట్
ఆరు రోజుల పసికందును బ్యాగులో కుక్కి పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ అమెరికా మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని నినోయ్ అక్వినో అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన జెన్నిఫర్ ఎరిన్ టాల్బోట్(43) అనే మహిళ డెట్రాయిట్ వెళ్లేందుకు మనీలా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. డెల్టా విమానం కోసం ఎదురుచూస్తున్న ఆమె లగేజీని సెక్యూరిటీ అధికారులు తనిఖీ చేశారు. అయితే తన లగేజీని తనిఖీ చేయవద్దని అధికారులను వారించింది. దీంతో సెక్యూరిటీ అధికారులకు ఆమెపై మరింత అనుమానం కలిగింది. వారి అనుమానం నిజమే అయింది. తనిఖీల్లో ఆమె తీసుకెళ్తున్న లగేజీలో ఆరు రోజుల పసికందు బయటపడింది.
పసికందును ఓ పెద్ద బ్యాగులో పెట్టి మిగతా లగేజీతో కలిపి వేసింది. వెంటనే అధికారులు ఆ పసికందును బ్యాగులోంచి బయటకు తీశారు. జెన్నిఫర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆమె ఆ పసికందుకు తాను బంధువునని చెప్పింది. ఆ పనికందు వయసు ఆరు రోజులు అని తెలిపింది. అయితే పసికందుతో జెన్నిఫర్‌కు ఉన్న సంబంధాన్ని నిరూపించడానికి ఆమె వద్ద ఎలాంటి పత్రాలు లేవు. దీంతో ఆమెపై పిల్లల అక్రమ రవాణా కింద కేసు నమోదు చేశామని నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు వెల్లడించారు. పసికందును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.