ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. ఎవరి వినోదాన్ని వారు అరచేతిలోనే పొందుతున్నారు. హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండటం, ఓటీటీలు కొత్త కొత్త సినిమాలను ప్రదర్శిస్తుండటంతో టీవీల అవసరం లేకుండానే కావాల్సిన ఎంటర్టైన్మెంట్ లభిస్తోంది. ఇక ఓటీటీలను లాగిన్ చేయని వారికోసం ఓటీటీలో వచ్చే సినిమాలను, వెబ్ సీరీస్‌లను ప్రేక్షకులకు అందించేందుకు ఐ బొమ్మ అనే వెబ్‌సైట్‌ను కొంతమంది ఔత్సాహికులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ వెబ్‌సైట్‌ను ఎవరు రన్ చేస్తున్నారన్న విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.కానీ ,గతంలో తాము పైరసీకి పాల్పడుతున్నామన్న ఆరోపణలు వస్తున్నాయని, ఐ బొమ్మను నిలిపివేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. కానీ కొంత మంది ఫాలోవర్స్ రిక్వెస్ట్ మేరకు మళ్లీ తమ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇలా ఒకటికాదు రెండు కాదు అనేక సార్లు ఐ బొమ్మ తమ సేవలను నిలివేస్తున్నట్లు ప్రకటించి తిరిగి ఫాలోవర్స్ కోరిక మేరకు వెబ్‌సైట్‌ను కొనసాగించింది.
అయితే తాజాగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఐ బొమ్మ వెబ్సైట్ నిలిచిపోయింది. ఈ క్రమంలో ఐ బొమ్మను పోలిన కొన్ని కొత్త వెబ్సైట్ లు నెట్టింట్లో పుట్టుకొచ్చాయి. ఆ విషయం తెలియక ఫాలోవర్స్ ఆ వెబ్సైట్లపై క్లిక్ చేస్తూ లేనిపోని సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ఈ కొత్త వెబ్సైట్లు స్పామ్వేర్ను విస్తరింపజేస్తున్నాయని తెలుస్తోంది. ఈ వెబ్సైట్లో ఏదైనా సినిమా లింక్ మీద క్లిక్ చేస్తే వేరే లింకులు ఓపెన్ అవుతున్నాయి. ఈ లింకులను కనుక ఓపెన్ చేస్తే, మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఐ బొమ్మ కేవలం ఓటీటీలో రిలీజ్ అయిన కంటెంట్‌ను మాత్రమే అప్లోడ్ చేసేది, కానీ కొత్తగా పుట్టుకొచ్చిన వెబ్సైట్లు థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాల లింకులను కూడా పెడుతున్నాయి. కొత్త సినిమా అని ఖుషీ అయ్యి లింక్ ఓపెన్ చేస్తే మీ సెల్ ఫోన్ గల్లంతవ్వాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆ లింకులను క్లిక్ చేయవద్దని కోరుతున్నారు.