యాంటి బయాటిక్స్ వాడుతున్నారా? అయితే ఇది కచ్చితంగా చదవండి - MicTv.in - Telugu News
mictv telugu

యాంటి బయాటిక్స్ వాడుతున్నారా? అయితే ఇది కచ్చితంగా చదవండి

February 5, 2018
  • ఇండియాలో అమ్ముతున్న 64% యాంటి బయాటిక్స్ కు అస్సలు అనుమతే లేదు
  • ప్రభుత్వ (CDSCO) అనుమతి లేని యాంటిబయాటిక్స్ ను విచ్చలవిడిగా అమ్ముతున్న కంపెనీలు
  • నిబంధనలకు విరుద్దమైన ఫార్ములేషన్ తో యాంటి బయాటిక్స్
  • విచ్చలవిడి యాంటిబయాటిక్స్ తో “సూపర్ బగ్” ల ఉత్పత్తి కేంద్రంగా ఇండియా
  • పౌల్ట్రీ రంగంలో “కొలిస్టిన్” వినియోగంతో పెరుగుతున్న దుప్పరిణామాలు

               క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్, న్యూకాస్టల్ యూనివర్సిటీ లు మనదేశంలోని అమ్ముడవుతున్న యాంటిబయాటిక్స్ పై పరిశోధన చేశాయి. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ క్లీనికల్ ఫార్మకాలజీలో ఆ పరిశోధన వ్యాసం పబ్లిష్ అయింది. దాని ప్రకారం ఫార్మా తయారీ కంపెనీలకు ఇండియా ఓ ప్రయోగశాలగా మారింది. అడ్డమైన మందులన్నింటిని ఇండియన్స్ పై ప్రయోగించి అడ్డగోలుగా సంపాదించుకుంటున్నాయి. ప్రజల ప్రాణాలంటే లెక్క చేయడం లేదు. ప్రభుత్వ అనుమతి లేకుండానే యాంటీ బయాటిక్స్ ను అమ్ముతున్నాయి. మనదేశంలో డాక్టర్లు విరివిరిగా రాస్తున్న యాంటిబయాటిక్స్ లో 64 శాతం మందులకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) అనుమతి లేదు. 2007-2012 మధ్య కాలంలో ఇండియాలో అమ్ముడైన యాంటిబయాటిక్స్ పై ఈ పరిశోధన జరిగింది.

మల్టీ డ్రగ్ కాంబినేషన్ తో ముప్పు            

పలు రకాల వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రెండు లేదా అంతకుమించి యాంటిబయాటిక్స్ ను ఒకే మందులాగా ఫార్మా కంపెనీలు తయారుచేస్తాయి. దీన్నే ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ (FDC) అంటారు. ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి గొంతు నొప్పి, జ్వరం, బాడీ పేయిన్స్ తో బాధపడుతున్నట్టైతే అతడిక్ అజిత్రోమైసిన్, పారాసిటామల్, అసిక్లోఫినాక్ మందులను ఇవ్వాలి. అయితే ఈ మూడు రకాల ట్యాబ్లెట్ లకు బదులుగా  డాక్టర్లు  ఒక్కటే పిల్ ను రాస్తారు. ఇది ఆ మూడు యాంటిబయాటిక్స్ ను కలిపి తయారుచేసిన ట్యాబ్లెట్. ఫిక్స్ డ్ డోస్ కాంబినేషన్ అంటే ఇదే. దాదాపు 118 ఫార్ములేషన్స్ ను ఇలా FDC  లో కంపెనీలు తయారుచేస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియలో ఫార్మా కంపెనీలు బేసిక్ నిబంధనలను కూడా పట్టించుకోవడం లేదు. CDSCO లో ఎలాంటి పరీక్షలు చేయించకుండానే మార్కెట్ లోకి డంప్ చేస్తున్నాయి. 12 అంతర్జాతీయ ఔషధ తయారీ కంపెనీలతో పాటు 500 దేశీ ఫార్మా కంపెనీలు ఉత్తత్తి చేస్తున్న 3300 రకాల బ్రాండ్ లు ఈ లిస్ట్ లో ఉన్నాయి.

కొంతమంది డాక్టర్లు, ముఖ్యంగా సరైన శిక్షణ, అవగాహన లేని కొంతమంది RMP,PMP లు వ్యాధిని త్వరగా తగ్గించి పేరు తెచ్చుకోవాలని ఈ మల్టీ డ్రగ్ కాంబినేషన్ లను రాస్తున్నారు.

యాంటి బయాటిక్స్ కు విరుగుడు

నిబంధనలకు విరుద్దంగా తయారైన FDC ట్యాబ్లెట్స్ తో మోతాదుకు మించిన యాంటి బయాటిక్స్ మన శరీరంలోకి చేరుతున్నాయి. దీంతో వ్యాధి కారక బ్యాక్టీరియా, వైరస్ లు వాటికి విరుగుడును తయారు చేసుకుంటున్నాయి. ఏ యాంటి బయాటిక్ కు లొంగని సూపర్ బగ్ లా మారుతున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా యాంటి బయాటిక్స్ వాడుతున్న  దేశం ఇండియానే. దీంతో పాటే యాంటిబయాటిక్స్ కు లొంగని ఇన్ ఫెక్షన్లు మనదేశంలోనే ఎక్కువగా బయటపడుతున్నాయి. ఇప్పటికే ఎంతో నష్టం జరిగింది. భవిష్యత్తులో ఇది మరిన్ని అనర్థాలకు కారణం అవుతుందని నివేదిక తెలిపింది. ఇండియాలో ఈ  FDC మందులపై నిషేధం విధించాలని కోరింది.

కోళ్లకు కోలిస్టిన్

మనుషులకు కూడా వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన కొలిస్టిన్ యాంటిబయాటిక్ ను కోళ్లకు ఇస్తు కొన్ని ఫార్మా కంపెనీలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. మనుషులకు చివరి ఆశగా ఇవ్వాల్సిన కొలిస్టిన్ ను కోళ్ల బరువు పెంచే ఔషధంగా కొన్ని వెటర్నరీ మందుల తయారీ కంపెనీలు పౌల్ట్రీలకు సరాఫరా చేస్తున్నాయి. ఆ కోళ్ల మాంసం తినడం ద్వారా కొలిస్టిన్ మనుషుల్లోకి చేరుతోంది. వివిధ వ్యాధికారక క్రిములు ఇప్పటికే ఆ యాంటిబయాటిక్ కు విరుగుడును తయారుచేసుకున్నాయి. దీంతో ఇప్పటిదాక తయారుచేసిన ఏ యాంటిబయాటిక్ కు కూడా లొంగని సూపర్ బగ్ లు ఇండియాలో బయటపడుతున్నాయి.

చిన్న మాట

ఈ సారి డాక్టర్ దగ్గరకు పోయినప్పుడు మల్టి డ్రగ్ కాంబినేషన్ మందులు కాకుండా సింగిల్ కాంబినేషన్ పిల్స్ ను రాయమని కోరండి. చిన్న చిన్న ఇన్ ఫెక్షన్లు, రోగాలకు కూడా యాంటిబయాటిక్స్ రాయమని డాక్టర్లను బలవంతపెట్టడం బంద్ చేయండి. మంచి ఆహారం, తగినంత వ్యాయామంతో వ్యాధులను మీకు దూరంగా ఉంచుకోండి. అప్పుడే ఈ యాంటిబయాటిక్స్ చేసే కీడు నుంచి కొంతైన తప్పించుకోవచ్చు.

Courtesy :- British Journal of Clinical Pharmacology

                    http://rdcu.be/GiAY/