ఉట్నూర్, నార్నూర్ ఉద్రిక్తం.. 144 సెక్షన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఉట్నూర్, నార్నూర్ ఉద్రిక్తం.. 144 సెక్షన్

December 16, 2017

ఊహించినట్లుగానే కోటా విషయంలో ఆదివాసులు, లంబాడాల మధ్య చిచ్చు రాజుకుంది. ఆదిలాబాద్‌ జిల్లాలో ఇరు పక్షాల మధ్య ఘర్షణలు జరిగాయి. గిరిజనులు లంబాడాల ఇళ్లపై దాడి చేశారు. కుమ్రం భీం విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. నార్నూర్‌, ఉట్నూర్‌ మండలాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

శుక్రవారం నార్నూర్‌ మండలం బేతాల్‌గూడ గ్రామంలోని గిరిజన గోండు యోధుడు కుమ్రం భీం విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులదండ వేయడం ఘర్షణలకు దారి తీసింది. వందలాది ఆదివాసీలు ఉట్నూర్‌ మండలం దేవుగూడ వద్ద చేరుకొని ధర్న చేశారు. కుమ్రంభీం విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. మరోపక్క.. హస్నాపూర్‌లో ఆదివాసీలపై దాడులు జరిగాయని వదంతులు వచ్చాయి. ఆదివాసులు హస్నాపూర్‌ వెళ్లారు. పోలీసులు అడ్డుకున్నా ఫలితం లేకపోయింది.  హస్నాపూర్‌లోని లంబాడాల ద్విచక్రవాహనాలకు ఆదివాసులు నిప్పుపెట్టారు. ఒక వైన్స్‌ షాపును, హోటల్ ను తగులబెట్టారు లంబాడా హోటల్‌ను తగులబెట్టారు

రోడ్డు ప్రమాదం.. వదంతులు..

మరోపక్క.. గురువారం రాత్రి ఉట్నూరు మండలంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంతో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఆ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. చనిపోయింది లంబాడాలేనని వదంతులు వ్యాపించాయి. శుక్రవారం రాత్రి ఉట్నూరులో ఆదివాసీలు రెండు వైన్‌ షాపులను ధ్వంసం చేశారు. మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌కు చెందిన ఆసుపత్రిపై రాళ్లు రువ్వారు. జైనూరు, సిర్పూరు(యు) మండలాల్లోనూ ఆదివాసీల బంజారాల ఆస్తులపై దాడులకు దిగారు. శాంతిభద్రతలు మరింత దిగజారకుండా ఉట్నూర్‌, నార్నూర్‌, ఇంద్రవెల్లి మండలాల్లో 144 సెక్షన్‌ విధించారు.

ఎవరూ చనిపోలేదు..

ఉట్నూరులో హింసకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. మీడియాలో తప్పుడు ప్రచారం జరగుతోందని, ఎవరూ ఎవరూ చనిపోలేదని స్పష్టం చేశారు. హస్నాపూర్‌ గ్రామంలో రోడ్డుప్రమాదం కారణంగా ఇద్దరు మరణించారన్నారు. ఎస్టీల జాబితా నుంచ లంబాడాలను తొలగించాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.