తెలంగాణలో కరోనా కేసుల విషయంలో కేసీఆర్ అబద్ధాలు చెప్పారని, రాష్ట్ర పరిస్థితిపై ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టీకాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమారెడ్డి మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నుంచి పంటను భారీ ధరకే కొంటోందని, తమ పార్టీలపై కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ‘ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన తెంగాణ మీ జాగీర్ అవుతుందా? మీరు నియంతలా మాట్లాడుతున్నారు. వేల కోట్లు అక్రమంగా సంపాదించి విలాసంగా జీవిస్తున్నారు..’ అని విమర్శించారు. నిన్న కేసీఆర్ తన ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై ఉత్తమ్ ఈ రోజు గాంధీ భవన్‌లో ఘాటుగా స్పందించారు.
‘నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి వ్యక్తిని చూడలేదు. పారాసెటమాల్ బిళ్లలతో కరోనా పోతుందని అసెంబ్లీ సాక్షిగా చెప్పినోళ్లను దద్దమ్మ అనాలా? బఫున్ అనాలా? మరణాల సంఖ్య ఎక్కువగా లేదని చెప్పడానికి సిగ్గుండాలి. మరణాల లెక్కలు చెబుతున్న కేసీఆర్ మరి పరీక్షల విషయంలో ఇతర రాష్ట్రాలతో ఎందుకు పోల్చుకోలేదు?
రెడ్ జోన్‌లలో వైన్ షాప్స్ కాకుండా ఏ దుకాణాలు తెరవొద్దా? మద్యం షాపులపై ఆయనకు ఎందుకంత ప్రేమ?
తెలంగాణలో వలస కార్మికుల లెక్కలు తేల్చలేని ప్రభుత్వం వాళ్ళను అదుకుంటుందా? అందుకే కార్మికులు వాళ్ళ ఊళ్లకు వెళ్తాం అంటున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా?’ అని ఉత్తమ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లోనూ రైతు రుణాలను మాఫీ చేశారని, ఛత్తీస్ ఘడ్‌లో కేంద్రం ప్రకటించిన 1800 మరింత కలిపి 2500లకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యమైందని అన్నారు.