యూపీలో మరో గ్యాంగ్‌రేప్, హత్య.. మత్తుమందిచ్చి..  - MicTv.in - Telugu News
mictv telugu

యూపీలో మరో గ్యాంగ్‌రేప్, హత్య.. మత్తుమందిచ్చి.. 

October 1, 2020

Uttar Pradesh another tragedy balrampur district .

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. కాలేజీ ఫీజు కట్టి వెళ్లి వస్తున్న యువతిని ఓ కిరాణా షాపులోకి తీసుకెళ్లి ఘాతుకానికి తెగబడ్డారు. ఆమెకు మత్తుమందిచ్చి అత్యాచారం చేసి చంపేశారు. బలరాంపూర్ జిల్లా గైన్సారీ గ్రామంలో  ఘోరం జరిగింది. 

22 ఏళ్ల మృతురాలు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. బీకామ్ ప్రైవేటుగా చదువుతున్న ఆమె ఫీజు కట్టి తిరిగి వస్తుండగా నలుగురు దుర్మార్గులు కారులో బలవంతంగా తీసుకెళ్లారు. తర్వాత గ్రామంలోని షాపులోనే రేప్ చేశారు. అపస్మారకంలోకి వెళ్లిపోయిన ఆమె తర్వాత రిక్షాలో ఇంటికి చేరుకుంది. చేతికి మత్తుమంది ఇచ్చిన పైపు కూడా కనిపించింది. ‘నాకు నొప్పిగా ఉంది, చచ్చిపోతాను’ అని తల్లితో చెప్పింది. ఆస్పత్రికి తరలిస్తుండగా కారులోనే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకున సాహిల్, షాహిద్ అనే యువకులను అరెస్ట్ చేశారు. మిగతా నిందితులకు కోసం గాలిస్తున్నారు. తమ కూతురు కాళ్లు చేతులు విరగ్గొట్టారని తల్లిదండ్రులు చెబుతుండగా, అలాంటిదేమీ లేదని పోలీసులు చెబుతున్నారు. కేసును పక్కదారి పట్టించే యత్నాలు సాగుతున్నాయని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

 మరోపక్క.. యూపీలోని బాగ్‌పత్‌లో ఓ మైనర్ బాలికపై జరిగిన దారుణం వెలుగు చూసింది. గత నెల 27న కొందరు ఆమెపై లైంగిక దాడి చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆమె ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. హత్రాస్ ప్రాంతానికి చెందిన మనీషా అనే యువతిని నలుగురు పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే.