ఆ పిల్లలవి హత్యలే.. పాలకులకు పాపం చుట్టుకుంటుందా !? - MicTv.in - Telugu News
mictv telugu

ఆ పిల్లలవి హత్యలే.. పాలకులకు పాపం చుట్టుకుంటుందా !?

August 12, 2017

‘ ఊరు కాలి ఒకడు ఏడుస్తుంటే సుట్టకు మంట కావాల్నని అన్నడట ఇంకోడు ’ అన్నట్టే ఉన్నది కత. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ తీరు అచ్చం పైన చెప్పుకున్న చందంగానే వుంది. ఆయన గోరఖ్ పూర్ లోని గోశాలను సందర్శించి అక్కడి గోవుల మంచి చెడ్డలు అరుస్కున్నాడు. గానీ ఆ తలాపునే ఈ ఆరు రోజుల్లో దరిదాపు 63 మంది పసి పిల్లలు మెదడువాపు వ్యాధితో పిట్టల్లా రాలిపోయారు. అయినా తనకేం సంబంధం లేనట్టే వ్యవహరించడం చాలా మందిని విస్మయానికి గురి చేస్తోంది ? ఇంకా ఈ వ్యాధి బారినపడిన చాలా మంది పిల్లలు హాస్పిటళ్ళలో చికిత్సలు పొందుతున్నారు. ఎందరో తల్లులు కడుపుకోతతో అల్లాడుతుంటే సీఎం గారు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. హాస్పిటళ్ళలో ఆక్సీజన్ అందక పిల్లల ప్రాణాలు హరీ అంటున్నా సీఎం కినుకుపాటుగా వుండటం ఎంతవరకు రైటన్నది చర్చనీయాంశంగా మారింది. తను పుట్టి పెరిగిన జిల్లాలోనే ఇంతటి అధ్వాన్న పరిస్థితి వుంటే ఇక రాష్ట్ర ప్రజలను ఆయనేం పట్టించుకుంటాడనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రజలు తమకు ఓటేసి గెలిపించారనే ఇంగితం కూడా కరువయ్యిందా సీఎం గారికి అని ప్రశ్నిస్తున్నారు దేశభక్తులు ? దేశ భవిష్యత్తుకు దిశలు చూపే రేపటి పౌరులు అలా అనామకంగా చనిపోతుంటే యూపీ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నట్టు ? ఇప్పటికే ఆ పిల్లలు చదువుకునే స్కూల్ ప్రిన్సిపల్ సస్పెండయ్యాడు. హెల్త్ మినిస్టర్ సిద్ధార్థ్ నాథ్ సింగేమో ఆ పిల్లలు ఆక్సీజన్ అందకపోవడం వల్ల చనిపోలేదని అనడం చాలా విడ్డూరంగా వుంది. దీని మీద సీఎం గారు స్పందించి వెంటనే ఈ ఘటన మీద ఆఘమేఘాల మీద ఇన్వెస్టిగేషన్ చేయించమన్నారట. బాగుంది ప్రజల మీద యోగి గారి దయ.

సమర్థమైన పాలన లేనప్పుడు ఇలా ఏ పాపం తెలియని పసివాళ్ళు ప్రాణాలు వదిలాలా ? ఇవి ఖచ్చితంగా హత్యలే. పాలకులకు పాపం చుట్టకోకుండా వదిలి పెడుతుందా ?
దేవుడి మీద భక్తి ఎక్కువైనవాడికి మనిషి కన్పించడు. అతని కష్టం అస్సలు కన్పించదు. ఏమైనా అంటే అంతా ఆ భగవానుడే చూస్కుంటాడని అన్నా అంటారు ఇలాంటి భక్త అధికారులు. రేపటి పౌరులు అంత దయనీయంగా చనిపోతుంటే సీఎం స్పందించకపోవటం వెనుకున్న మతలబు ఏంటి ? గోరక్ష పేరిట జరుగుతున్న దాడులకు, తాజా ఈ ఉదంతానికీ సీఎంకు ఎలాంటి సంబంధం లేదు సుమా !? దీనిపై యూపీ సర్కార్ క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షం కాంగ్రెస్ కోరుతోంది. కానీ యోగీ క్షమాపణ కోరినంత మాత్రానా పోయిన పిల్లల ప్రాణాలను మాత్రం తిరిగి తేలేరు కదా ? పాపం కదా ఎంతో భవిష్యత్తు వున్న పసివాళ్ళు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు వదలటం హృదయ విదారకరం. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఈ ఉదంతంతో కన్నీరు మున్నీరౌతోంది. ఆ కన్నీటికి కారణం చేతకాని ప్రభుత్వమే.