ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్ ఇటీవల మతఘర్షణలతో అట్టుడికిపోయింది. దీనికి సంబంధించి బరేలీ కలెక్టర్ ఆర్. విక్రం సింగ్ ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ ఒకటి దుమారం రేపుతోంది. హిందుత్వ సంస్థలు ఆయనపై భగ్గుమంటున్నారు. ‘మీరు ముస్లింల వీధుల్లోకి వెళ్లి పాకిస్తాన్‌కు వ్యతిరేక నినాదాలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఆ ముస్లింలేమన్నా పాకిస్తానీలా?’ అని సింగ్ తన పోస్ట్‌లో ప్రశ్నించారు.
ముస్లిం జనావాసాల్లోకి అతివాద హిందూకార్యకర్తలు వెళ్లి నినాదాలు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘ఇటీవల ఓ కొత్త సంప్రదాయం పుట్టుకొచ్చింది. గొడవలు జరిగినప్పుడల్లా కొందరు చిత్రమైన పనులు చేస్తుంటారు.. ముస్లింల ఇళ్ల ముందుకు వెళ్లి పాక్ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. ఎందుకిదంతా వారేమైన పాకిస్తాన్ ప్రజలా..? కాదు కదా!’ అని అన్నారు.
బరేరీలో గత ఏడాది జరిగిన అల్లరను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. శైవభక్తులు ముస్లింల ఇళ్లవద్దకు వెళ్లి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని, ఆ ప్రాంతంలోనే ఉంటున్న తాను అలా చేయొద్దని వారిని వారించానని తెలిపారు. ‘అయినా వారు నా మాట వినలేదు.. ఇంత మతపిచ్చి ఎందుకో? ఇలాంటి ప్రవర్తన దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతిస్తుంది.. ’ అని సింగ్ హెచ్చరించారు.
కలెక్టర్ పోస్టులపై బీజేపీ నేతలే కాకుండా ప్రభుత్వ నేతలు కూడా మండిపడుతున్నారు. రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. అయితే సింగ్ దీన్ని పట్టించకోవడం లేదు. ‘కాస్ గంజ్ఎస్పీని బదిలీ చేశారు. నిజాయతీపరులకు విలువలేదు…’ అని ఎదురుదాడికి దిగారు. కాస్ గంజ్‌లో రిపబ్లిక్ డే రోజు తిరంగా ర్యాలీ సందర్భంగా గొడవలు రేగాయి. ఒకరు చనిపోగా పలువురు గాయపడ్డారు.