అల్లావుద్దీన్ అద్భుత దీపమని రూ. 31 లక్షలకు కొన్నాడు! - MicTv.in - Telugu News
mictv telugu

అల్లావుద్దీన్ అద్భుత దీపమని రూ. 31 లక్షలకు కొన్నాడు!

October 31, 2020

Uttar Pradesh Conmen Sell ‘Aladdin’s Lamp’ To Meerut Doctor For Rs 31 Lakh

రెండు తలలపాటు, మంత్రాల బియ్యం, మహిమల తాయెత్తుల జాబితాలో అల్లావుద్దీన్ అద్భుత దీపం కూడా చేరిపోయింది. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్న సామెత మరోసారి రుజువైంది. రుజువు కావడమే కాదు ఏకంగా రూ. 31 లక్షల చేతిచమురు వదిలింది. కోరిక కోరికలు తీర్చే అల్లా ఉద్దీన్ అద్భుత ద్వీపమంటూ ఓ ఇత్తడి సెమ్మను ఆశ చూపి దగా చేశారు. 

 లండన్ నుంచి వచ్చిన లాయిక్ ఖాన్‌ అనే డాక్టర్ కొన్నాళ్ల  కిందట జబ్బుతో బాధపడ్డాడు. అతనికి సమీనా మహిళ పరిచయమైంది. ఆమె ఖాన్‌ను మాటల్లో పెట్టి మచ్చిక చేసుకుంది. తనకు తెలిసిన ఇస్లాముద్దీన్ అనే బాబా వద్ద మహిమలు ఉన్నాయని, ఏ సమస్య అయినా ఇట్టే తీర్చేస్తాడని నమ్మించింది.  ఇద్దరూ బాబా వద్దకు వెళ్లారు. తన వద్ద అనుకున్న కోరికను నెరవేర్చి పెట్టే అల్లావుద్దీన్ అద్భుత దీపముందని బాబా.. ఖాన్‌ను నమ్మించాడు. డాక్టర్ ఆశతో దాన్ని తనకు అమ్మేయమన్నాడు. బాబా మొదట రూ. 1.75 కోట్లు చెప్పాడు. తర్వాత బేరం రూ. 70 లక్షలకు కుదిరింది. ఖాన్ అడ్వాన్సుగా రూ. 31 లక్షలు ఇచ్చాడు. అయితే బాబా దీపం ఇవ్వకుండా జాప్యం చేశాడు. విసుగెత్తిన ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటికొచ్చింది. బంగార రంగు పూత పూసిన దీపాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని బాబాను కటకటాల వెనక్కి నెట్టారు. దర్యాప్తులో మరిన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. సదరు బాబా పక్కా ప్లాన్ వేసిన సమీనా భర్తేనని తేలింది.