పెంపుడు జంతువులు చనిపోతే చాలా మంది మానసికంగా కొంతకాలం బాధపడుతారు. మరీ సున్నిత మనస్కులైతే గొయ్యి తీసి పూడ్చి పెడతారు. కానీ, యూపీలోని ఓ పుంజు చనిపోతే ఆ కుటుంబం దానికి మనుషులకు చేసినట్టు దశదిన కర్మ చేశారు. ఇదే వింత అనుకుంటే ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఊళ్ల నుంచి 500 మంది హాజరయ్యారు. అయినా వెరవకుండా ఆ కుటుంబం వారందరికీ భోజనాలు పెట్టింది.
దీంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకెళితే.. ఓ కుటుంబం ఓ పుంజును పెంచుకుంటోంది. ఒకరోజు వారు ఇంట్లో లేనప్పుడు వారి నెల వయసున్న గొర్రెపిల్లను ఆ పుంజు ఊర కుక్కల దాడి నుంచి కాపాడింది. ఈ క్రమంలో పుంజుకు తీవ్ర గాయాలు కాగా, కాసేపటి తర్వాత పుంజు ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు పుంజు ప్రేమ, ప్రాణ త్యాగాన్ని తలచుకుని వెక్కివెక్కి ఏడ్చారు. మనుషులకు చేసినట్టుగానే పుంజుకు కూడా అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత దశదిన కర్మ కూడా చేసి పుంజు పట్ల తమ విశ్వాసాన్ని చాటుకున్నారు.