రౌడీ మూకలపై యూపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల గ్యాంగ్స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్ తర్వాత చాలా మందిలో భయం మొదలైంది. వరుసగా కొంత మంది నేరగాళ్లను ఏరివేయడంతో కొంత మంది లొంగిపోతున్నారు. నేరుగా బయటకు నేరాలను అంగీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ గ్యాంగ్స్టర్ అయితే ఎన్కౌంటర్ భయంతో వినూత్నంగా బయటకు వచ్చాడు. మెడలో తనను చంపొద్దని వేడుకుంటూ బోర్డు తగిలించుకొని పోలీసుల ముందుకు వచ్చాడు. సంభాల్ పోలీసుస్టేషనులో జరిగింది. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడదని వైరల్ అవుతోంది.
సంభాల్ పట్టణంలో నయీం అనే గ్యాంగ్స్టర్ ఆగడాలు చాలా కాలంగా పెరిగిపోయాయి. బెదిరించడం, చంపడం, సెటిల్మెంట్ లాంటి అనేక నేరాలకు పాల్పడ్డాడు. దీంతో పోలీసలు అతన్ని వాంటెడ్ గ్యాంగ్స్టర్ జాబితాలో చేర్చారు. ఈ విషయం తెలిసి అతనికి ఎన్కౌంటర్ భయం పట్టుకుంది. దాని నుంచి తప్పించుకునేందుకు మెడలో ఓ బోర్డు తగిలించుకున్నాడు. ‘నన్ను కాల్చి చంపొద్దు. చాలా తప్పులు చేశా. పోలీసులంటే భయంగా ఉంది. నా తప్పులు అంగీకరిస్తున్నా ప్లీజ్’.. అంటూ రాసి పెట్టుకొని పోలీస్ స్టేషన్కు వచ్చాడు. ఆశ్చర్యపోయిన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్లలో కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ గ్యాంగ్స్టర్లను అరెస్టులు చేయడం, మాట వినని వారిని ఎన్కౌంటర్ చేస్తున్న సంగతి తెలిసిందే.