అమానవీయం.. రహస్యంగా అత్యాచార బాధితురాలి అంత్యక్రియలు - MicTv.in - Telugu News
mictv telugu

అమానవీయం.. రహస్యంగా అత్యాచార బాధితురాలి అంత్యక్రియలు

September 30, 2020

policeee

యూపీలోని హత్రాస్‌లో జరిగిన ఘోర అత్యాచార ఉదంతం యావత్ దేశాన్నే కుదిపేసింది. అత్యంత పైశాచికంగా లైంగిక దాడికి గురై ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయిన యువతి అంత్యక్రియలు కూడా అమానవీయంగా జరిగాయి. కనీసం తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వకుండా పోలీసులే ఖననం చేశారు. దీంతో తమ బిడ్డ చివరి చూపునకు కూడా నోచుకోలేకపోయామని బాధిత కుటుంబం వాపోయింది. పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

19 ఏళ్ల యువతిపై సెప్టెంబర్ 14వ తేదీన నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి ఆమె నాలుక కోసం పక్కటెముకలు విరిచేశారు. తీవ్ర గాయాలతో అవయవాలు అన్ని పాడైపోయాయి. 14 రోజుల పాటు ఆస్పత్రిలో చావు బతుకులతో పోరాడి చివరికి మృత్యువు ముందు ఓడిపోయింది. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో నిన్న మరణించింది. ఈ నేపథ్యం పోలీసులు రహస్యంగా మృతదేహాన్ని ఖననం చేశారు. ఆందోళనలు చెలరేగకుండా భారీగా పోలీసులను మోహరించి ఈ కార్యక్రమం పూర్తి చేశారు. 

ఆస్పత్రి నుంచి అంబెలెన్స్ లో మృతదేహాన్నినేరుగా హత్రాస్ ప్రాంతానికి తీసుకువచ్చారు. ఈ విషయం బయటికి వచ్చేలోపే నేరుగా శ్మశానానికి తరలించారు.  ఈ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో కనీసం కుటుంబ సభ్యులను కూడా తెలియకుండా పోలీసులే చితికి నిప్పుపెట్టారు. శాంతి భద్రతల సమస్య ఏర్పడకుండా చూసేందుకు మృతదేహాన్ని తరలించాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. కానీ ఈ చర్యను పలువురు తప్పుబడుతున్నారు. బాధితురాలి పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ విమర్శిస్తున్నారు.