బీజేపీకి చాయ్ వాలా ఉల్టా ధమ్కీ! - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీకి చాయ్ వాలా ఉల్టా ధమ్కీ!

December 5, 2017

చాయ్ వాలా అంటే మోదీని గుర్తుకొస్తాడు. మనం ఆయన చాయ్ అమ్ముతుండగా చూడలేదు గాని చాయ్ వాలాలకు ఎన్నికల్లో మంచి డిమాండే ఉంది. బీజేపీ అయితే.. చాయ్‌వాలా ప్రధాని కావడం తమ గొప్పే అని ఊరూవాడా చెబుతూ ఉంటుంది. అలాంటి బీజేపీకి ఒక చాయ్ వాలా ఉల్టా ధమ్కీ ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో అతడు బీజేపీ అభ్యర్థిని ఓడగొట్టాడు. అది కూడా 10 సార్లు ఎన్నికల్లో గెలిచిన వాడిని మట్టికరిపించాడు.

చిత్రకూట్‌కు చెందిన అనూజ్ గమ్ చాయ్ దుకాణం నడుపుతున్నాడు. ఇతడు మున్సిపల్ ఎన్నికల్లో 21వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి అజయ్ కుమార్‌పై సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగాడు. ఈ ఎన్నికల్లో అనూజ్‌కు 326 ఓట్లు సాధించగా, అజయ్ కుమార్  286 ఓట్లతో సరిపెట్టుకున్నాడు. దాంతో విజయ్‌పై అనూజ్ సంచలన విజయం సాధించాడు.

ఈ విజయంపై అనూజ్ మాట్లాడుతూ…ఓ దేశానికి ఓ చాయ్‌వాలా ప్రధాని అయినప్పుడు నేను మున్సిపల్ కౌన్సిలర్ ఎందుకు కాకూడదు? అని ప్రశ్నించాడు. పోలింగ్‌కు ముందు ఇంటింటి ప్రచారం నిర్వహించానని చెప్పాడు. ‘నా చాయ్ దుకాణం కూడా నా విజయంలో కీలకపాత్ర వహించింది. ఇక్కడికి చాయ్ తాగాడానికి వచ్చిన వారితో నాకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. దాంతో నా ప్రచారం కూడా తేలిక అయింది. నాకు టికెట్ ఇచ్చిన సమాజ్ వాదీ పార్టీకి ధన్యవాదాలు’ అంటూ ఈ చాయ్ వాలా పేర్కొన్నాడు.