పెళ్లికొడుకును బంధించి మరొకరిని పెళ్లాడిన వధువు - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లికొడుకును బంధించి మరొకరిని పెళ్లాడిన వధువు

December 8, 2019

uttar pradesh 22

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్‌నోర్ జిల్లాలోని నంగల్‌జత్ గ్రామంలో జరిగిన ఓ పెళ్ళిలో వధువు తీసుకున్న నిర్ణయం సంచలనం అవుతోంది. ముహూర్తం రోజున వరుడు చేసిన పనికి చిర్రెత్తిన వధువు పెళ్లి రద్దు చేసుకుని అదే మండపంలో వేరే యువకుడితో మనువాడింది. శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నంగల్జాత్ గ్రామంలో ఆరేళ్ల క్రితం జరిగిన సామూహిక వివాహాల్లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే తమ పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలని కలగన్న ఆ వధూవరులకు ఆ పెళ్లి నచ్చలేదు. దీంతో ఆ అమ్మాయి కాపురానికి వెళ్లకుండా పుట్టింట్లోనే ఉంటోంది. 

ఆరేళ్ల తర్వాత వారిద్దరూ ఘనంగా మరోసారి పెళ్లి చేసుకోవాలని ఏర్పాట్లు చేసుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ముహూర్తం పెట్టుకున్నారు. అందరూ పెళ్లి మండపానికి వచ్చినా ముహూర్త సమయానికి వరుడు రాలేదు. వరుడు పెద్ద ఊరేగింపుతో బయలుదేరి ఆ రోజు రాత్రి మండపానికి చేరుకున్నాడు. దీంతో పెళ్లికూతురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్ళికొడుకుని గదిలో బందించి మరుసటి రోజున అదే మండపంలో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ ఘటనపై వరుడి వాదన మరోలా ఉంది.పెళ్లికూతురు కుటుంబసభ్యులు శుక్రవారం తమను ఓ గదిలో బంధించారని ఆరోపించారు. తమ వద్ద ఉన్న విలువైన వస్తువులు కూడా బలవంతంగా లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే కట్నకానుకల విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం నడుస్తున్నట్టు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో వీరి వివాదం పోలీసుల వరకూ వెళ్లింది. వారు..ఇరు కుటుంబాలతో చర్చించి రాజీ కుదిర్చి పంపించారు.