Uttar Pradesh: Man called for counselling beats up cop inside police station
mictv telugu

కోపిష్టి మొగుడు.. పోలీసోడినే కొట్టాడు.. వైరల్ వీడియో

July 5, 2022

Uttar Pradesh: Man called for counselling beats up cop inside police station

గృహ హింస కేసుకి సంబంధించి పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ కోసం వచ్చిన ఓ వ్యక్తి.. పోలీసులపై వీరంగం వేశాడు. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే పోలీసును చితకబాదాడు. తనను విచారించడానికి పిలిచిన పోలీసుపై సదరు వ్యక్తి దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు వ్యక్తిపై అందిన గృహ హింస ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసుల కౌన్సిలింగ్ తో విసిగిపోయిన వ్యక్తి ఏకంగా పోలీసుపై దాడికి పాల్పడ్డాడు. అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అతడిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ అతను పోలీసుపై దాడి చేశాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

అతడిని ఆపే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ కుర్చీ అడ్డుపెట్టి కొట్టకుండా ఆపే ప్రయత్నం చేసింది. ఇవేవీ పట్టించుకోని అతడు.. పోలీసు అధికారిపై ఇష్టారీతిలో దాడి చేశాడు. అయితే సదరు వ్యక్తి మానసిక పరిస్థితి బాగాలేదని అతని కుటుంబం పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు అందుకు సంబంధించిన మెడికల్ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తే దానిని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసులపై దాడి చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు మొయిన్‌పురి పోలీసులు వెల్లడించారు. పట్టరాని కోపంతో పోలీసుపై దాడికి పాల్పడిన వ్యక్తి చివరకు కటకటాల పాలయ్యాడు.