10 పెళ్లిళ్లు చేసుకున్నాడు.. చంపేశారు! - MicTv.in - Telugu News
mictv telugu

10 పెళ్లిళ్లు చేసుకున్నాడు.. చంపేశారు!

January 22, 2021

bfv

చట్టం ప్రకారం ఒక మనిషి ఒక పెళ్లి మాత్రమే చేసుకోవాలి. రెండో పెళ్లి చేసుకోవాలంటే అందుకు బలమైన కారణాలు ఉండాలి. కానీ ఓ పెద్దమనిషి చట్టాలకు తూచ్ కొట్టి ఏకంగా 10 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అంతమంది భార్యలు ఉన్నా ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు. కోట్ల ఆస్తికి వారసులు లేరని బాధపడుతుండగా విధి వక్రించింది. అతణ్ని దగ్గరి బంధువులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆస్తి కోసమే ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లా భోజిపురా గ్రామానికి చెందిన జగన్ లాల్ యాదవ్ విషాదగాథ ఇది. 52 ఏళ్ల జగన్ లాల్‌కు కోట్ల ఆస్తి ఉంది. 1990లో అతడు తొలి పెళ్లి చేసుకున్నాడు. తొలి భార్యకు అదివరకే పెళ్లయి ఒక కొడుకు ఉన్నాడు. జగన్‌కు ఆమె ద్వారా పిల్లలు పుట్టకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకూ పిల్లలు పుట్టకపోవడంతో మొత్తం 10 పెళ్లిళ్లు చేసుకున్నాడు. 10 మంది భార్యలో ఐదుగురు చనిపోగా, ముగ్గురు తమ ప్రియులతో లేచిపోయారు. ప్రస్తుతం ఇద్దరు భార్యలు ఉన్నారు.

జగన్ ప్రస్తుతం తొలి భార్యకు ఆమె మొదటి భర్త ద్వారా జన్మించిన కొడుకు వద్ద ఉంటూ కాలక్షేపం చేస్తున్నాడు. 50 ఏళ్ల దాటడంతో పెళ్లిళ్లకు స్వస్తి పలికి ఇంటి వద్దే పొలం పనులు చూసుకుంటున్నాడు. తను చనిపోయాక తన ఆస్తిని తొలి భార్య కొడుక్కి ఇవ్వాలని వీలునామా రాశాడు. ఇది గిట్టని జగన్ అన్నయ్య ఆగ్రహంతో ఊగిపోయాడు. కోట్ల ఆస్తిని వేరే వాళ్లకు ఇవ్వడం అతనికి నచ్చలేదు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి జగన్‌ను అతని పొలంలోనే గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. జగన్ అన్నయ్యే నిందితుడని పోలీసులు భావిస్తున్నారు. పది పెళ్లిళ్లు చేసుకున్నా పిల్లలు పుట్టకపోవడం ఒక విషాదమైతే, ఆస్తి కోసం అన్నే చంపించడం మరింత ఘోరమని గ్రామస్తులు వాపోతున్నారు.