పోలీసులు లాక్‌డౌన్ విధుల్లో రేయింబవళ్లు కష్టపడుతూ కరోనాను దీటుగా ఎదుర్కొంటున్నారు. వందల సంఖ్యలో వైరస్ బారిన కూడా పడుతున్నారు. ప్రజలు వారిని కీర్తిస్తున్నారు. మరోపక్క అదే పోలీసుల్లో కొందరు చేతిలో కర్ర ఉంది కదా అని అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తలలు పగలగొట్టడమే కాకుండా పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ లో జరిగిన ఈ ఉదంతం వారి దుర్మార్గాన్ని కళ్లకు కడుతోంది.
UP Police priorities in Meerut.
— Bint-E-Hawa بنتِ حوا (@zTweeps) May 11, 2020
వీధుల్లో గస్తీ కాస్తున్న పోలీసులకు ఒక వారగా ఉన్న కూరగాయల బండ్లు కనిపించాయి. పొట్టకూటి కోసం వాటిని అమ్ముకునే చిరువ్యాపారులు ఇళ్లలో ఉండిపోయారు. బండ్ల వద్ద ఎవరూ లేకపోడంతో ఇద్దరు పోలీసులు వాటిని ఎత్తి పడేశారు. మనుషులు తినే కూరగాయలను కాలువపాలు చేశారు. మేడపై నుంచి ఎవరో ఈ కొవ్వు చేష్టను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. పోలీసు శాఖ తీవ్రంగా స్పందించి విచారణకు ఆదేశించింది. ఇలాంటి ఘటనలతో మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని, ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని అధికారులు హెచ్చరించారు.