ఎంత పౌష్టికమో.. బకెట్ నీటిలో లీటర్ పాలు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎంత పౌష్టికమో.. బకెట్ నీటిలో లీటర్ పాలు..

November 28, 2019

యూపీలో పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం పక్కదారి పడుతోంది. కాసులకు కక్కుర్తిపడి చిన్నారుల తిండిని బొక్కేస్తున్నారు కేటుగాళ్లు. ఇటీవల విద్యార్థులకు రోటీతో పాటు కూరకు బదులు ఉప్పు మాత్రమే వడ్డించి  విమర్శల పాలయ్యారు. ఈ ఘటన మర్చిపోక ముందే మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. చిన్నారులకు అందించాల్సిన పాలను కల్తీ చేసేస్తున్నారు. లీటర్ పాలకు బకెట్ పాలు కలిపి ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిర్వాహకులపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

సోన్‌భద్ర జిల్లాలోని కోటా గ్రామంలో ఓ ప్రైమరీ స్కూలులో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పాలను కూడా అందిస్తున్నారు.  కానీ నిర్వాహకులు మాత్రం 81 మంది విద్యార్థులకు కేవలం ఒక లీటర్ పాల ప్యాకెట్‌తోనే సరిపెడుతున్నారు. దానికి బకెట్ నీళ్లు కలిపి ఇస్తున్నారు. ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులు గుర్తించి విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయంపై ఆరా తీయగా విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా పాల పంపిణీ జరగడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకే ఎక్కువగా నీటిని కలపాల్సి వచ్చిందంటున్నారు. 

వాస్తవానికి ఆ పాఠశాలలో 171 మంది విద్యార్థులు ఉన్నారని వారు కూడా వచ్చి ఉంటే ఇంకా మూడు బకెట్ల నీరు లీటర్ పాలకు కలపాల్సి వచ్చేదని అన్నారు. దీని వల్ల పిల్లల ఆరోగ్యం కూడా పాడైపోతోందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా పాలు పంపిణీ చేసేలా చూడాలని కోరుతున్నారు. ఇంతకీ పాలు సరిపడా లేకపోవడానికి నిర్వాహకులు కారణమా..? లేక అధికారులే పంపిణీ చేయడం లేదా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.