రేప్ జరిగాక రా, చూద్దాం..బాధితురాలితో పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

రేప్ జరిగాక రా, చూద్దాం..బాధితురాలితో పోలీసులు

December 8, 2019

uttar pradesh 02

ఇంకా అత్యాచారం జరుగలేదు కదా.. జరిగాక రా.. అప్పుడు చూద్దాం. ఇది ఓ అత్యాచారయత్నం బాధితురాలికి పోలీసులు ఇచ్చిన సమాధానం. ఇది జరిగిన మరెక్కడో కాదు. ఓ అత్యాచార కేసులో దేశం దృష్టిని ఆకర్షించిన యూపీలోని ఉన్నావ్ జిల్లాలోనే. స్థానిక సిందుపూర్‌ గ్రామానికి చెందిన ఓ యువతి తనపై ఐదుగురు యువకులు అత్యాచారయత్నం చేశారంటూ శనివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వస్తే ఈ విధంగా సమాధానమిచ్చారు.

ఈ సంఘటన గురించి బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ..‘మందుల దుకాణానికి వెళ్తున్న నన్ను ఐదుగురు యువకులు అడ్డగించి బలాత్కారం చేయబోయారు. వారిలో ముగ్గురిని నేను గుర్తుపట్టగలను. వారి పేర్లు కూడా నాకు తెలుసు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి తొలుత నేను 1090 కి కాల్‌ చేశాను. వాళ్లు 100కు ఫోన్‌ చేయమన్నారు. 100కు ఫోన్‌ చేస్తే ఉన్నావ్‌ పోలీస్ స్టేషన్‌కి వెళ్లమన్నారు. అక్కడికి వెళ్తే సంఘటన జరిగిన ప్రదేశం స్థానిక బిహార్‌ పోలీస్‌ స్టేషన్‌ పిరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్లమన్నారు. మూడు నెలల నుంచి నన్ను ఇలాగే తిప్పించుకుంటున్నారు. నేను ఫిర్యాదు చేస్తున్నానని తెలిసి ఆ యువకులు రోజూ మా ఇంటికి వచ్చి కేసు ఫైల్‌ అయితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. అయినా ఏదైనా ఘోరం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలి గానీ, జరిగాక హడావిడి చేస్తే న్యాయం ఎలా జరుగుతుందని’ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన గురించి అక్కడి పోలీస్ ఉన్నతాధికారులను మీడియా ప్రశ్నించగా వారు అలాంటిదేమీ లేదని పేర్కొనడం గమనార్హం. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండి పడుతున్నారు. సదరు పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.