తల్లీకూతుళ్లను ట్రాక్టర్‌తో తొక్కి చంపిన రేపిస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

తల్లీకూతుళ్లను ట్రాక్టర్‌తో తొక్కి చంపిన రేపిస్ట్

July 16, 2020

AP High Court angry over House-site allotme

ఎవరైనా నేరం చేసి జైలుకి వెళ్తే పశ్చాత్తాపంతో కుమిలిపోతారు. జైలు నుంచి వచ్చిన తరువాత ఏ తప్పు చేయకుండా మిగిలిన జీవితాన్ని గడుపుతారు. కానీ, కొందరు మాత్రం వాళ్ళు జైలుకి వెళ్ళడానికి కారణమైన వాళ్లపై కోపం పెంచుకుని మరో నేరానికి పాల్పడతారు. అలాంటి ఓ సంఘటన ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని కాస్‌గంజ్‌లో బుధవారం జరిగింది.

శాంతి దేవి, సుష్మ(17) అనే తల్లీకూతుళ్లు మార్కెట్ నుంచి సైకిల్ పై వస్తుండగా వెనక నుంచి ఓ ట్రాక్టర్ వచ్చి బలంగా ఢీకొట్టింది. ఘటనాస్థలిలోనే తల్లీకూతుళ్లు మృతిచెందారు. దీనిని అంతా రోడ్డు ప్రమాదం అనుకున్నారు. కానీ, శాంతి దేవి భర్త బాదన్ సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయం బట్టబయలైంది. తల్లీకూతుళ్లను చంపిన వ్యక్తులు తమకు తెలుసని బాదన్ సింగ్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించాడు. 2016లో తన కూతురిపై రేప్ చేశాడని.. వారిపై కేసుపెట్టినందుకే  ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

అసలు విషయానికి వస్తే.. యశ్ వీర్ అనే యువకుడు బాదన్ సింగ్ ఇంటి ఎదురుగా నివసిస్తున్నాడు. బదాన్ సింగ్ ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి అతడి కుమార్తె సుష్మాపై యశ్ వీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బదాన్ సింగ్ అతడిని పోలీసులకు పట్టించాడు. 2017లో యశ్ వీర్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పటినుంచి బాదన్ సింగ్ కుటుంబంపై విపరీతంగా కోపం పెంచుకున్నాడు. అంతే కాకుండా డబ్బుల విషయంలో కూడా యశ్‌వీర్‌ తండ్రికి, బాదాన్ సింగ్ కి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో యశ్ వీర్ తండ్రి మరణించాడు. ఆ కేసులో బాదన్ సింగ్‌ అరెస్ట్ అయి 2018లో విడుదలయ్యాడు. దీంతో తనను జైలుకు పంపినందుకు, తన తండ్రిని చంపినందుకు బదాన్ సింగ్ కుటుంబంపై యశ్ వీర్ పగతో రగిలిపోయేవాడు. పగ తీర్చుకోవడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తుండేవాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం మార్కెట్‌ నుంచి సైకిలుపై ఇంటికి వస్తున్న తల్లీకూతుళ్లపై ట్రాక్టర్‌ ఎక్కించాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు యశ్ వీర్ కోసం వెతుకుతున్నారు.