ఈ ప్రపంచంలో వింతలకు కొరత లేదు. నమ్మశక్యంకాని సంఘటనలు కోకొల్లుగా జరుగుతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో అలాంటి ఉదంతమొకటి నమోదైంది. ఎలుకను హత్యచేశాడని పోలీసులు ఓ మనిషిని అరెస్ట్ చేశారు. ఎలుకలను చంపడం చట్టవిరుద్ధమేమీ కాదు కదా అని అశ్చర్యపోతున్నారు కదూ. దీని వెనక పెద్ద కథే ఉంది మరి.
चूहे की हत्या के आरोप में युवक गिरफ्तार, पत्थर में बांधकर नाले में फेंका था | Unseen India pic.twitter.com/akBOCIBR8R
— UnSeen India (@USIndia_) November 25, 2022
బదాయూకు చెందిన మనోజ్ కుమార్ అనే యువకుడు రోడ్డుపక్కన కల్వర్టుపై కూర్చుని ఉండగా ఓ ఎలుక అటు ఇటు తిరిగింది. మనోజ్ మైండ్ ఆ టైంలో ఎలా ఉందోగాని దాన్ని చటుక్కున పట్టుకున్నాడు. అంతటితో ఊరుకోకుండా దాని తోకకు రాయి కట్టి తమాషా చూశాడు. ఈ జీవి రాయిని లాగలేక చస్తుంటే సంబరపడిపోయాడు. ఆ తతంగం చూసిన వికేంద్ర శర్మ అనే జీవకారుణ్యమూర్తి మనోజ్‌ను మందలించాడు. మనోజ్ కోపంతో రెచ్చిపోయాడు. ఎలుకను రాయితో సహా కాలువలో పడేశాడు. వికేంద్ర వర్మ అయ్యో పాపం అంటూ ఎలుకను కాలువ నుంచి బయటికి తీశాడుగాని అప్పటికే అది చచ్చూరుకుంది. మనోజ్‌కు, శర్మకు మధ్య పెద్ద గొడవైంది. ‘‘మరిన్ని ఎలుకలను చంపుతా, ఏం చేసుకుంటావో చేస్కో,’’ అన్నాడు మనోజ్. శర్మ కూడా ఊరుకోకుండా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. మనోజ్ ఎలుకను చిత్రహింసలు పెట్టి చంపాడని, అతన్ని శిక్షించాలని కోరాడు. పోలీసులు తలపట్టుకున్నారు. ఫిర్యాదుపై చర్య తీసుకోక తప్పదు కనక మనోజ్‌ను అరెస్ట్ చేసి, ఎలుకను పోస్ట్ మార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.