చెట్లను నరికేవాడిని కాపాడిన చెట్టు - MicTv.in - Telugu News
mictv telugu

చెట్లను నరికేవాడిని కాపాడిన చెట్టు

February 13, 2021

tree

వృక్షో రక్షతి రక్షిత: అంటారు పెద్దలు. మనం చెట్లను కాపాడితే అవి మనల్ని కాపాడతాయి. పర్యావరణ పరిరక్షణతోపాటు మనం ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లు అవసరం. కానీ కొందరు ఆ సంగతి పట్టించుకోకుండా ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. అయినా ప్రకృతి పెద్ద మనసుతో మానవజాతికి మేలే చేస్తోంది. కొండలను నాశనం చేస్తూ, చెట్లను నరకడమే పనిగా పెట్టుకున్న ఓ మనిషి ప్రాణాలను ఓ చెట్టే కాపాడింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన వరదల్లో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.

49 ఏళ్ల విక్రమ్ చౌహాన్ పని కొండలను కూల్చి, చెట్లు నరకడమే. బుల్డోజర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న విక్రమ్ ఇప్పటి వరకు వందల ఎకరాల ప్రకృతిని చదును చేశాడు. పొట్టకూటి కోసం ఆ పని చేస్తున్న అతనికి ప్రకృతి సంరక్షణపై అవగాహన లేదు. గత ఆదివారం రుషిగంగ ప్రాంతంలో అతడు బుల్డోజర్‌తో కొండలు తవ్వుతుండగా ఒక్కసారిగా వరద వెల్లువెత్తింది. విక్రమ్ సహా చుట్టుపక్కల ఉన్న వాళ్లు కొట్టుకుపోయారు. విక్రమ్ ఓ చెట్టును ఢీకొన్నాడు. తర్వాత బాధ భరిస్తూ ఆ చెట్టునే ఆసరాగా చేసుకున్నాడు. అరగంట పాటు దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. తర్వాత సహాయక సిబ్బంది అతణ్ని గుర్తించి కాపాడారు.
‘నేను ఒక్క చెట్టును కూడా కాపాడలేదు. కానీ ఓ చెట్టే నాకు ప్రాణం పోసింది..’ అని భావోద్వేగంతో చెబుతున్నాడు విక్రమ్. ప్రస్తుతం అతడు డెహ్రాడూన్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.