ద్యావుడా.. ఎద్దుల బండికి చలానా! - MicTv.in - Telugu News
mictv telugu

ద్యావుడా.. ఎద్దుల బండికి చలానా!

September 16, 2019

Uttarakhand Police Challan To Bullock Cart 

కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్న చందంగా తయారైంది ట్రాఫిక్  పోలీసుల తీరు. కొత్త మోటార్ వాహనాల చట్టం అమలులోకి వచ్చాక దేనికి జరిమానా వేస్తున్నామనే విషయం మరిచి వింతగా ప్రవర్తిస్తున్నారు. వాహనాలకు చలానా విధించాల్సింది పోయి ఏకంగా ఎద్దుల బండికి కూడా జరిమానా విధించారు. ఈ ఘటనతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. 

ఛబ్రా గ్రామానికి చెందిన రియాజ్ అనే వ్యక్తి తన పొలానికి ఎద్దుల బండి కట్టుకొని వెళ్లాడు. రోడ్డు పక్కనే దాన్ని నిలిపి అతడు తన పనిలో నిమగ్నం అయ్యాడు. అటుగా వచ్చిన పోలీసులు ఎద్దుల బండి రోడ్డుపక్కన ఉండటాన్ని గమణించి దాన్ని వారి వెంట తీసుకెళ్లారు. తర్వాత ఎస్సై పంకజ్ కుమార్ రైతును పిలిపించి నిబంధనలు పాటించనందుకు కొత్త మోటార్ చట్టం ప్రకారం రూ. 1000 జరిమానా కట్టాలని సూచించాడు.  

ఈ విషయం ఆనోటా ఈనోటా తెలిసి వైరల్‌గా మారింది. ఎద్దుల బండికి ఫైన్ ఎలా వేస్తారంటూ అంతా ప్రశ్నించడం ప్రారంభించారు. వెనక్కి తగ్గిన పోలీసులు జరిమానా తీసుకోకుండానే బండిని తిరిగి అప్పగించారు.  ఎస్సై పంకజ్ కుమార్ తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. ఛబ్రా ప్రాంతంలో ఎద్దుల బండి ద్వారా ఇసుక దందా సాగుతుండటంతో అనుమానించిన పోలీసులు అతనికి జరిమానా వేశారని చెప్పారు. చివరికి ఇసుకదందాతో అతనికి సంబంధంలేదని తెలిసి చలానా రాయలేదని వెల్లడించారు. ఏది ఏమైనా ఎద్దుల బండికి ఫైన్ వేయడం వింతగా ఉందని ఈ విషయం తెలిసిన వారు అభిప్రాయపడుతున్నారు.