Uttarakhand Receptionist Murder: Resort Demolished On CM's Order, BJP Leader's Son Arrested
mictv telugu

రిసెప్షనిస్ట్ హత్యకేసు.. రిసార్ట్ కూల్చివేతపై అనుమానాలు

September 25, 2022

ఉత్తరాఖండ్‌లో దారుణ హత్యకు గురైన రిసెప్షనిస్ట్ కేసులో ప్రభుత్వ చర్యలపై యువతి కుటుంబసభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల అరెస్ట్ తర్వాత యువతి పనిచేసే రిసార్టు భవనం అక్రమ నిర్మాణమని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం దానిని కూల్చివేసింది. ఈ చర్యను మృతురాలి కుటుంబీకులు తప్పుపట్టారు. ఆధారాలను నాశనం చేసేందుకే ఈ చర్యను చేపట్టారని పేర్కొన్నారు. సాక్ష్యాలను నాశనం చేసేందుకే రిసార్టును కూల్చివేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు మృతురాలి పోస్టుమార్టం తుది నివేదిక వచ్చేవరకూ అంత్యక్రియలు నిర్వహించమని బాధితురాలి తండ్రి తేల్చిచెప్పారు. రిషికేష్‌ రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న ఆ యువతి కనిపించకుండా పోయిన ఆరు రోజుల తర్వాత శనివారం రిషికేశ్‌ వద్ద చీలా కాల్వలో మృతదేహం బయటపడిన సంగతి తెలిసిందే. ఆమె మృతదేహానికి ఎయిమ్స్‌లోని నలుగురు వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఆమె గాయాలకు సంబంధించిన వివరాలు తుది నివేదికలో ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు పులకిత్‌ తండ్రి.. హరిద్వార్‌లో బీజేపీ కీలక నేత అయిన వినోద్‌ ఆర్యను, ఆయన మరో కుమారుడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి హామీ ఇచ్చారు. రిసార్ట్‌ కూల్చివేయాలంటూ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ఇచ్చిన ఆదేశాలను ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇది ప్రణాళికబద్దమైన హత్య అని, సాక్ష్యాలను నాశనం చేసేందుకే రిసార్ట్‌ను కూల్చివేస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.