మదర్సాలపై వక్ఫ్ బోర్డు కీలక నిర్ణయం.. మోదీ కల సాకారం! - MicTv.in - Telugu News
mictv telugu

మదర్సాలపై వక్ఫ్ బోర్డు కీలక నిర్ణయం.. మోదీ కల సాకారం!

November 24, 2022

మదర్సాలలో బోధించే విద్యపై ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి అన్ని మదర్సాలలో సిలబస్, యూనిఫామ్ విషయంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతున్నట్టు చైర్మన్ షాదాబ్ షామ్స్ తెలిపారు. ఎన్సీఈఆర్టీ సిలబస్ ప్రవేశపెట్టి డ్రెస్ కోడ్ పూర్తిగా మార్చేస్తామని గురువారం తెలిపారు. అన్ని మతాల వారికి మదర్సాలలో అడ్మిషన్లు ఇస్తామని, మతబోధన ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకే పరిమితం చేస్తామని స్పష్టం చేశారు. తర్వాత 8 గంటల నుంచి 2 గంటల వరకు అన్ని స్కూళ్ల మాదిరి సబ్జెక్టలను బోధిస్తామని చెప్పారు. అలాగే ఏడు మదర్సాలను ఏర్పాటు చేసి స్మార్ట్ క్లాసులు ప్రవేశపెడతామని వివరించారు.

ఆధునిక విద్యాబోధన వల్ల విద్యార్ధులు మరింత మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని, ప్రధాని మోదీ చెప్పినట్టు పిల్లల ఓ చేతిలో ఖురాన్, మరో చేతిలో ల్యాప్ టాప్ ఉండే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. అంతేకాక, మదర్సాలలో హఫీజ్ ఇ ఖురాన్ బోధన వ్యవధిని నాలుగేళ్ల నుంచి పదేళ్లకు పెంచాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. అప్పటికి విద్యార్ధులు 10 లేదా 12వ తరగతి పాసవుతారని, తద్వారా మానసిక పరిపక్వత వచ్చి మతపరమైన విద్య కొనసాగించాలా? లేక డాక్టర్లు, ఇంజినీర్లు అవ్వాలా? అనేది తేల్చుకోగలుగుతారని అన్నారు. అటు మదర్సాలలో ఆధునిక విద్యకు ప్రభుత్వం తరపున సాయమందిస్తామని సీఎం పుష్కర్ సింగ్ ధామి, మైనారిటీ శాఖ మంత్రి చందన్ రామ్ దాస్ హామీ ఇచ్చారు. కాగా, వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో 103 మదర్సాలు ఉన్నాయి.