సైరా నరసింహారెడ్డి దోపిడీదొంగా? స్వాతంత్ర్య సమరయోధుడా? - MicTv.in - Telugu News
mictv telugu

సైరా నరసింహారెడ్డి దోపిడీదొంగా? స్వాతంత్ర్య సమరయోధుడా?

January 31, 2018

బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసి వారి గుండెల్లో నిద్రపోయిన రాయలసీమ పాళెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని అక్కడి ప్రజలు ఇప్పటికీ .. ‘సైరా నరసింహారెడ్డి.. నీ పేరే బంగారపు కడ్డీ..’ అని పాడుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రాంతంలో ఆంగ్లేయులపై వెయ్యిమంది యోధులతో తిరగబడిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు అని కీర్తిస్తుంటారు. అతని జీవితం ఆధారంగా చిరంజీవి హీరోగా ‘సైరా’ చిత్రం వస్తుండడంతో రెడ్డి గురించి తెలియని వారికి కూడా తెలిసింది.

అయితే నరసింహారెడ్డి గొప్పవాడేమీ కాదని, అతడు పచ్చి దోపిడీదొంగ అని కొన్నాళ్లు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు కొందరు. అతడు డబ్బు కోసమే కోవెలకుంట్ల ఖజానాను కొల్లగొట్టాడని అంటున్నారు. అయితే దీన్ని పలువురు చరిత్రకారులు తోసిపుచ్చుతున్నారు. రెడ్డి తన పింఛను కోసమే కాకుండా తన ప్రాంత బడుగువర్గాల ప్రయోజనాల కోసం కూడా పోరాడారని చెబుతున్నారు. మరి ఏది నిజం?

నెక్కంటి శ్రీనివాసరావు ఆరోపణ

నరసింహారెడ్డి దోపిడీ దొంగ అని చరిత్ర పరిశోధకుడు నెక్కంటి శ్రీనివాసరావు ఆరోపించారు. ఒక దొంగను స్వాతంత్య్ర సమరయోధుడిగా కీర్తిస్తున్న అందరూ క్షమాపణ చెప్పాలని ఆయన ఓ టీవీ చర్చాకార్యక్రమంలో డిమాండ్ చేశారు. అయితే రెడ్డి నిజంగానే స్వాతంత్ర్యయోధుడని రాయలసీమ మేధావి భూమన్ గట్టిగా వాదించారు. ఈ చర్చ సోషల్ మీడియాకు విస్తారించింది. దీనికి కులవాదం కూడా తోడైంది. దీంతో మాటల్లో చెప్పలేని తిట్లతో చర్చలు సాగుతున్నాయి.

చరిత్ర ఏం చెబుతోంది..?

బ్రిటిష్ వారి డాక్యుమెంట్లలో నరసింహారెడ్డి గురించి చాలా వివరంగా రాశారు. అతడు తిరుగుబాటును రెచ్చగొట్టాడని అన్నారు. ఈ నేపథ్యంలో చరిత్రలోకి, ప్రజలు పాడుకునే గేయాల్లోకి వెళ్దాం.. కడప, కర్నూలు జిల్లాల మధ్య ఉన్న జమ్ములమడుగు నుంచి కోయిలకుంట్ల దాకా ఉన్న ప్రాంతాన్ని నొస్సం అని పిలిచేవారు. దీన్ని పాలించిన జయరామిరెడ్డి.. అప్పటి మద్రాస్ గవర్నర్ థామస్‌ మన్రోను ఎదిరించాడు. ఆంగ్లేయులు అతణ్ని బంధించి నొస్సాన్ని చేజిక్కించుకున్నారు. అతని వంశంవారికి 11 రూపాయల 10 ఆణాల 15 పైసల పింఛను మంజూరు చేశారు.

ముష్టివాడికి ముష్టోడని అవమానం..

జయరామిరెడ్డి కొడుకులు లేకపోవడంతో సోదరి కొడుకైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని దత్తతకు తీసుకున్నాడు. నరసింహరెడ్డి రూపనగుడి గ్రామంలో పుట్టి ఉయ్యాలవాడలో పెరిగాడు. పింఛను నరసింహారెడ్డికే అందేది. అయితే కరువుకాటకాలతో అల్లాడుతున్న ప్రాంతంలో బ్రిటిష్ వారు శిస్తులు విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉండేవారు. ఈ విషయంలో రెడ్డితో గొడవ జరిగింది. శిస్తులు కట్టొద్దని రెడ్డి ప్రజలకు చెప్పారు. తిరుగుబాటుకు బీజం పడింది. ఈ నేపథ్యంలో పింఛను కోసం రెడ్డి అనుచరుడు కాసీం సాహెబ్ అనే తన అనుచరుడిని కోవెలకుంట్ల ట్రెజరీకి పంపాడు. అతణ్ని తహసీల్దార్‌ రాఘవాచారి అవమానించాడు. ‘తెల్లదొరలు వేసే ముష్టితో బతికే ఒక ముష్టివాడికి మరో ముష్టివాడివి..’ అని కించపరాడు.

ముందుగా చెప్పి మరీ దాడి..

ఈ విషయాన్ని కాసీం.. రెడ్డికి చెప్పాడు. ఈ అవమానాన్ని భరించలేక రెడ్డి తిరుగుబాటు చేశాడు. 1846 జూలై 10న కోవెలకుంట్ల ట్రెజరీని కొల్లగొట్టాడు. ఈ పనిచేస్తానని తెల్లదొరలకు ముందుగానే చెప్పి మరీ దాడి చేశాడు. ట్రెజరీలో డబ్బు, తుపాకులను చేజిక్కించుకుని తహసీల్దార్‌ రాఘవాచారి తలనరికి ఊరేగించాడు. డబ్బును ప్రజలకు, తన అనుచరులకు  పంచాడు. విషయం కడపలోని బ్రిటిష్ అధికారులకు, వారి నుంచి మద్రాసులోని ఉన్నతాధికారులకు తెలిసింది. రెడ్డికోసం వేట మొదలైంది. నరసింహారెడ్డి ఎర్రమల కొండల్లోకి వెళ్లాడు.

కలెక్టర్‌ కాక్రేన్‌, కెప్టెన్‌ నార్టన్‌ నాయకత్వంలోఆంగ్లేయ సైన్యం రెడ్డి కోసం గాలించింది. కానీ రెడ్డి దొరకకుండా వారిని ముప్పు తిప్పలు పెట్టాడు. రెడ్డి కుటుంబాన్ని బ్రిటిష్ పాలకులు కడప జైల్లో బంధించారు. వారిని విడిపించుకోవడానికి రెడ్డి అడవుల్లో బోయకులస్తులతో సైన్యం సమకూర్చుకున్నాడు. అయితే ఓ వ్యక్తి.. రెడ్డి ఆచూకీని తెల్లదొరలకు చెప్పాడు. నరసింహారెడ్డి బంధించారు. గొలుసువేసి కోవెలకుంట్లలో ఊరేగించారు. 1847 ఫిబ్రవరి 22న జుర్రేరు నది తీరంలో చెట్టుకు ఉరి తీశారు. తలను నరికేసి, కోవెలకుంట్ల కోట గుమ్మానికి వేలాడదీశారు. విషయం తెలుసుకున్న ప్రజలు భోరున విలపించారు. అతనిపై పాటలు కట్టి పాడుకున్నారు. ప్రస్తుతం 80, 90 ఏళ్ల వయసులో ఉన్న నొస్సం, రూపగుడి, ఉయ్యాలవాడ తదితర ప్రాంతాల్లోని వృద్ధులు కూడా ఇదంతా నిజమేనని చెబుతున్నారు. నరసింహారెడ్డి తనకు వచ్చే పింఛను డబ్బులను కూడా ప్రజలకే పంచేవాడని చెబుతున్నారు.

బ్రిటిష్ వారిపై పోరాడితే దోపిడీ దొంగా?

బ్రిటిష్ వలసపాలనపై నరసింహారెడ్డికి ముందు, తర్వాత దేశమంతంటా చాలా తిరుగుబాట్లు సాగాయి. తమ సంస్థానాలపై తెల్లవారి ఆధిపత్యానికి, దోపిడీకి వ్యతిరేకంగానే స్థానిక రాజులు, జమీందారులు పోరాడారు. వారందరూ ప్రజాంసంక్షేమం కోసమే తిరుగుబాటు చేశారని చెప్పలేం. కానీ స్వాభిమానాన్ని, స్వతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి తిరుగుపాటు చేయడం గమనార్హం. 1857 తిరుగుబాటులో పాల్గొన్న ఝాన్సీ లక్ష్మీబాయి, నానా సాహేబ్, తాంతియా తోపే వంటి స్థానిక పాలకుల పోరాటాన్ని ఈ కోణంలోనే చూడాలి. బ్రిటిష్ వారు స్థానిక  పరిశ్రమలను, సంపదను కొల్లగొట్టి లండన్‌కు తరలించారన్ని తెలసిందే. స్థానిక పాలకులు స్వతంత్రంగా ఉంటే ఈ దోపిడీకి కాస్తయినా అడ్డుకట్టపడుతుంది. బ్రిటిష్ వారు దీన్ని గమనించే స్థానిక పాలకులను కీలుబొమ్మలను చేసుకొన్నారు. లొంగని నరసింహారెడ్డి వంటివారిని హతమార్చారు.

వలసపాలనకు వ్యతిరేకంగా సాగే ప్రతిపోరాటమూ రూపంలో పైకి స్థానికపాలకుల తిరుగుబాటుగానే కనిపించినా సారాంశంలో అది పరాయి పాలనకు, దోపిడీకీ వ్యతిరేకమే అని చరిత్ర నిరూపిస్తోంది. ఈ దృక్పథంతో చూస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దోపిడీ దొంగో, స్వాతంత్ర్య సమరయోధుడో ఒక అవగాహన వస్తుంది.