కోటి దాటిన పాట ! - MicTv.in - Telugu News
mictv telugu

కోటి దాటిన పాట !

July 6, 2017

ఒక బతుకమ్మ పాటకు యూట్యూబ్ లో కోటి వ్యూస్ రావటం సాధారణమైన విషయం కాదు. పెద్ద పెద్ద సినిమాస్టార్లకు కూడా అంతసీను లేదు. కాని 2015లో వి6న్యూస్ ఛానల్ లో వచ్చిన బతుకమ్మ పాటకు సాధ్యమైంది… సంచలనం సృష్టించింది. తెలంగాణాలోని ప్రతి పల్లెలో, పట్టణాల్లో చివరకు ప్రపంచదేశాల్లో తెలంగాణవాళ్లు ఎక్కడుంటె అక్కడ ఈ పాట వినిపించింది…ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది.  చివరకు ఆ ఛానల్ లో ఏ పాట వచ్చినా ఈ పాటగానే వీక్షిస్తున్నారు ప్రేక్షకులు. పాటకు అంతటి వేదికయ్యింది ఆ ఛానల్.  అప్పటి వరకు కేవలం ఎంటర్టైన్ మెంట్ ఛానల్ లు, మ్యూజిక్ ఛానల్ లకే పరిమితమైన పాటలు న్యూస్ ఛానల్ లో కూడా ప్రసారం చేయవచ్చన్న సంప్రదాయాన్ని వి6 ఛానల్ ప్రారంభించింది. న్యూస్ ఛానల్స్ రేటింగ్ ల పోటీ ప్రపంచం, పైగా సమైఖ్య పాలకుల అనేక ఆంక్షల మధ్య తెలంగాణ పాటను, మాటను గుండెలమీద ఎత్తుకున్నది టి న్యూస్ తో పాటు ఈ ఛానల్ ఒక్కటే. అలాంటి పరిస్థితుల్లో ఒక వినూత్నమైన ట్రెండ్ ని తీసుకురావటం నిజంగా ఆ ఛానల్ యాజమాన్యం గొప్పతనంగానే భావించాలి. తెలంగాణ సంస్కృతిని ఒక పాట ద్వార ఎంత గొప్పగా చెప్పొచ్చో , పాటతో కూడా ఉద్యమం ఎలా చేయవచ్చో ఈ ఛానల్ నిరూపించింది.

ఈ ఛానల్ లోని పాటల ప్రస్తావనకు వస్తే 2013లో సురేష్ బొబ్బిలి సంగీతంలో మిట్టపల్లి సురేందర్ రాసి పాడిన ‘జనని జనని జై తెలంగాణ’ పాట తెలంగాణా ఉద్యమ పాటలో ఒక కొత్త ట్రెండ్ ను తీసుకువచ్చింది. అదే సంవత్సరం వీరిద్దరి కలయికలో వచ్చిన ‘ ప్రకృతి మాతై ప్రతిగడపకు బతుకమ్మై’ పాట బతుకమ్మ ఒక కొత్త క్రేజిని తీసుకువచ్చింది. నిజమైన మనుషుల మధ్య చిత్రీకరించిన ఈ పాటతో వి6 ఛానల్ ను తెలంగాణ జనాలు గుండెలో పెట్టుకున్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో వి6 నుండి నాలుగు పాటలు విడుదలయ్యాయి. తెలంగాణా ఫార్మేషన్ డే ఆ తర్వాత హైదరాబాద్ గప్పతనంపై ఇలా అనేక సందర్బాల్లో పాటకు పట్టం కట్టింది ఈ ఛానల్. 2014 తిరుపతి మాట్ల రాసి పాడిన బతుకమ్మ పాట వచ్చే నాటికి వి6 పాటలకు వేదికయ్యింది. పాటంటే వి6 అనే నమ్మకాన్ని జనాల్లో తీసుకువచ్చింది. ఇక 2015లో వచ్చిన బతుకమ్మ పాట వచ్చే నాటికి ఈ ఛానల్ లో 6పాటలు వచ్చాయి దీంతో తెలంగాణ పాట అనేది ఈ వేదికను అత్యంత బలమైనదిగా తీర్చిదిద్దింది. ఇక 2015లో కందికొండ సాహిత్యం సురేష్ బొబ్బిలి సంగీతంలో తేలు విజయ, కందుకూరి శంకర్ బాబు ఆలపించిన ‘చిన్ని మా బతుకమ్మ..చిన్నారక్క బతుకమ్మ’  పాట ఇప్పటికీ ఎక్కడోఅక్కడ వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాట తీసుకువచ్చిన క్రేజ్ ఎంతటిదంటే ఆ ఛానల్ లో ఇపుడు ఏ పాట వచ్చినా  ఈ పాటనే ఊహించుకుంటున్నారు ప్రేక్షకులు. అద్భుతమైన పాటకు అంతకంటే మించిన రూపమిచ్చి ప్రసారం చేయటం ఇక్కడే మొదలయ్యింది.  ఈ రోజు తెలుగు న్యూస్ ఛానల్స్ అన్ని ప్రతి పండుగకు పాటలు చేస్తున్న సంస్కృతి ఈ ఛానల్ నుండే స్టార్టయ్యిందని చెప్పవచ్చు.

ఈ ప్రాంత సాహిత్యం, సంస్కృతి, పోరాట స్ఫూర్తి నుంచి వచ్చిన మట్టి బిడ్డలు ఈ పాటకు ప్రాణం పోసారు. అప్పటి ప్రోగ్రామింగ్ హెడ్ దామన్న దర్శకత్వం అక్షరాలను ఆడంబరంగా అల్లి, అలతి అలతి పదాలతో మెస్మరైజ్ చేసి, సామాన్యుడిక్కూడా అర్థమయ్యేలా పాటలు రాసే కందికొండన్న సాహిత్యం.. వినసొంపైన ట్యూన్లతో సంగీతానికే సరిగమలు పలికించే బొబ్బిలి  సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ హృదయాలకు ఠక్కున ట్యూనైపోయే బాణీలు అందింతే తన సంగీత సారథ్యం ఈ పాటకు మరింత సొగసునిచ్చింది.  అలాగే తేలు విజయ.. ‘ అయ్యోడివా నువ్వు అవ్వోడివా ’ అంటూ తెలంగాణా ఉద్యమానికి ఊతమిచ్చిన తేలు విజయ గాత్రంతో జతకలిసిన కందుకూరి శంకర్ బాబు గానం.. ఓవరాల్ గా పాట వీనులు విందుగా రక్తి కట్టింది… చూసారా ఇంత మంది తెలంగాణా యువతేజాలు సంధించిన సమ్మోహన గీతానికి ప్రజలిచ్చిన అపూర్వ కానుక. అందుకే వీవర్స్ ని విపరీతంగా ఆకట్టుకోగలిగింది.. వాళ్ళు ఆదరించారు.. అక్కున చేర్చుకున్నారు..  ఇది నిజంగా తెలంగాణ ప్రజల ఔన్నత్యానికి నిదర్శనం. అద్భుతమైన పాటను ఇచ్చిన వి6 ఛానల్  కు, కోటి వీవ్స్ ఇచ్చిన తెలంగాణ ప్రజలందరికీ మరోసారి మైక్ టీవి తరుపున శతకోటి వందనాలు !!