వచ్చే ఏడాదే కరోనా వ్యాక్సిన్.. సీసీఎంబీ వెల్లడి - MicTv.in - Telugu News
mictv telugu

వచ్చే ఏడాదే కరోనా వ్యాక్సిన్.. సీసీఎంబీ వెల్లడి

July 4, 2020

ICMR

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో ప్రతీ ఒక్కరు కోరుకుంటోంది ఒక్కటే. వ్యాక్సిన్ రావాలని. వ్యాక్సిన్ వస్తేనే కరోనాకు మంగళం పాడొచ్చని అంటున్నారు. అయితే ఆ ఆశలన్నీ ఈ ఏడాది తీరేలా లేవు. ఒకటిరెండు కరోనా ఔషధాలు మన దేశంలో వచ్చినప్పటికీ అవి ఇంకా అందుబాటులో లేవు. దీంతో కరోనా వ్యాక్సిన్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సీఎస్‌ఐఆర్‌-సీసీఎంబీ సంచాలకులు రాకేశ్‌ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది కోవిడ్‌-19కు వ్యాక్సిన్‌ రావడం కష్టమేనని.. బహుశా వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి రావొచ్చని వ్యాఖ్యానించారు. భారీ స్థాయిలో క్లినికల్ ట్రయల్స్‌ చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. ‘వ్యాక్సిన్ల అభివృద్ధికి చాలా ఏళ్ల సమయం పడుతుంది. కానీ మనం ఇప్పుడు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాం. వ్యాక్సిన్‌ మెరుగ్గా పనిచేస్తే వచ్చే ఏడాది తొలినాళ్లలో రావొచ్చు. అంతకన్నా ముందైతే రాదు. నాకు తెలిసినంతవరకు అంతకన్నా ముందైతే వ్యాక్సిన రావడం కష్టమే’ అని మిశ్రా పేర్కొన్నారు.

మరోవైపు ఆగస్టు 15 లోపు కరోనా సూది మందును తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎస్‌ఐఆర్‌ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘అన్నీ పుస్తకాల్లో ఉన్నట్టే కచ్చితత్వంతో జరిగితే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో వ్యాక్సిన్ వస్తుంది. భారీ సంఖ్యలో క్లినికల్‌ ట్రయల్స్‌ జరపాల్సి ఉంటుంది. అనారోగ్యం ఉన్నవారికి మందుబిళ్ల ఇచ్చి తగ్గిందా లేదా అని చూసేందుకు ఇదేమీ డ్రగ్‌ కాదు. ప్రస్తుతం రోజుకు 400 నుంచి 500 వరకు కరోనా పరీక్షలు చేస్తున్నాం. ఇంతకన్నా తక్కువ సమయంలో, తక్కువ మందితో, తక్కువ ధరలో, ఎక్కువ పరీక్షలు చేసే విధానాన్ని మేము ఐసీఎంఆర్‌కు ప్రతిపాదించాం. అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం’ అని మిశ్రా తెలిపారు.