పబ్‌జీ ఆడుతున్న 10 మంది అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

పబ్‌జీ ఆడుతున్న 10 మంది అరెస్ట్

March 14, 2019

పబ్‌జీ గేమ్ ఇప్పుడు ఎంత ప్రమాదకరమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. ఇప్పటికి చాలా మంది యువత దీని బారిన పడి తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ఆట అని ఎందరు చెబుతున్నా వినడంలేదు ఎవ్వరు కూడా. మద్యం అలవాటు వున్నవాళ్లన్నా వీళ్ల కన్నా కాస్త బెటర్ అంటున్నారు. అంతగా మనుషులను దిగజార్చింది ఈ గేమ్. ఈ గేమ్‌ను నిషేదించాలని కన్నవాళ్ల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో గుజరాత్‌లోని రాజ్‌కోట్, సూరత్ జిల్లాల్లో పబ్‌జీ గేమ్‌పై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. పబ్లిక్‌గా ఈ గేమ్ ఆడటం చట్ట విరుద్ధం. మార్చి 9 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. గుజరాత్‌లోని ప్రాథమిక పాఠశాలలోనూ పబ్‌జీ గేమ్‌పై నిషేధం అమలులో ఉంది.

అయినా అక్కడ దొంగచాటుగా కొందరు, ఆ ఎక్కడి ఆంక్షలులే అని లైట్ తీసుకుని ఆడుతున్నారు. దీనిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆంక్షలకు విరుద్ధంగా ఆడుతున్న పది మందిని అరెస్ట్ చేశారు.  దర్యాప్తు కోసం వీరి మొబైల్ ఫోన్స్‌ను సీజ్ చేశారు. ఓ ఆంగ్ల మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్‌కోట్‌లో నిషేధం వున్నప్పటికీ కొందరు యథేచ్ఛగా ఈ ఆటను ఆడుతున్నారు. దీనిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. స్పెషల్ డ్రైవ్‌ నిర్వహించి పదిమంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. వాళ్లల్లో ఆరుగురు అండర్‌గ్రాడ్యుయేట్స్ అవడం విశేషం.

టీ షాపు దగ్గర, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద వీళ్లు పబ్‌జీ ఆడుతూ కనిపించారని పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు కూడా ఈ ఆట ఆడుతుండగా వారిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీరిపై సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేశారు. కాగా, ఆరుగురు కాలేజ్ స్టూడెంట్స్‌ను బెయిల్ మీద విడుదల చేశారు. మిగతా వారి బెయిల్ ప్రక్రియ నడుస్తోందని పోలీసులు తెలిపారు. ఇకపై ఎవరు పబ్‌జీ ఆడుతున్నారని తెలిస్తే వారికి శిక్ష తప్పదని హెచ్చిరిస్తున్నారు పోలీసులు.