తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పలు వైష్ణవ ఆలయాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని ఉత్తర ద్వారం దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో భద్రాచలం, యాదాద్రి, ధర్మపురి, సిద్దిపేట, హైదరాబాద్‌లోని పలు వైష్ణవ ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి.ఇక తిరుమల శ్రీవారి దర్శనం కోసం అర్ధరాత్రి నుంచే దర్శనాలను ప్రారంభించారు. పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు.
శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో స్వామివారు ఉత్తదారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 6.48 గంటలకు అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులకు సీతారామ చంద్రమూర్తి ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తున్నారు. గరుడ వాహనంపై శ్రీరాముడు, గజ వాహనంపై సీతమ్మ తల్లి కొలువుదీరారు. దీంతో ఆది దంపతుల దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో అధికారులు ఆలయంలో నిత్యకల్యాణాలను నిలిపివేశారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. మంత్రి హరీశ్ రావు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. స్వామివారికి స్వర్ణ కిరీటం సమర్పించారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సిద్దిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం, స్వామి వారికి స్వర్ణ కిరీటం సమర్పణ. pic.twitter.com/bMNUleAb8e
— Harish Rao Thanneeru (@trsharish) January 2, 2023
నేడు తిరుమల శ్రీవారిని తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే, ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, ఉషశ్రీ, మేరుగ నాగార్జున, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి తదితర ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో ఈ నెల 11 వరకు వైకుంఠద్వారం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది.