vajrasana benefits and how to improve vajrasana pose long time, yoga
mictv telugu

ఎక్కువసేపు వజ్రాసనం వేయాలంటే ఇలా చేయాలి

January 16, 2023

vajrasana benefits and how to improve vajrasana pose long time

యోగా భారతీయుల ప్రత్యేకత. ఎప్పటి నుంచో మన శాస్త్రాల్లో వేదాల్లో ఉందని చెబుతున్న యోగా ఇప్పడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. యోగా వలన చాలా లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఇది ప్రాక్టీస్ చేస్తే శారీరకంగా, మానసికంగా కూడా మన జీవితం మారిపోతుందని అంటున్నారు.

సూర్యనమస్కారం, పద్మాసనం, త్రికోణాసనం, ప్రాణాయామం.. ఇలా సులువుగా వేయదగిన ఆసనాలను రోజువారీ జీవనవిధానంలో కనీసం అరగంటైనా చేస్తే మానసిక, శారీరక ఆరోగ్యం సొంతమౌతుంది. వీటిల్లో వజ్రాసనం చాలా ఎఫెక్టివ్ అంటున్నారు యోగా గురువులు. సులభంగా చేయదగిన ఆసనాల్లో వజ్రాసనం కూడా ఒకటని చెబుతున్నారు. తిమ్మిర్ల నివారణ నుండి జీవక్రియను పెంచడం వరకు వజ్రాసనం ఎన్నో సమస్యలకు అద్భుతమైన పరిష్కారమార్గం. ఈ ఆసనాన్ని ప్రతి రోజూ 15 నిముషాలపాటు చేస్తే చేకూరే ప్రయోజనాలు బోలెడు.

మనసిక ఒత్తిడి నుంచి విడుదల,జీర్ణక్రియ వృద్ధి, ఎసిడిటీ నివారణ, బరువు తగ్గడం, రుతుస్రావ, కండరాలు, మూత్ర సమస్యలకు చికిత్స, వెన్నునొప్పిని తగ్గిస్తుంది.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్దలిస్టే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్య జీవనానికి వజ్రాసనం మూలసూత్రమని చెప్పొచ్చు.

ఐతే కొంతమంది 5 నిముషాలు కూడా వజ్రాసన భంగిమలో కూర్చోలేరు. కాళ్ళు తిమ్మిర్లు లేదా బెణకడం వంటివి అందుకు కారణాలుగా చెబుతారు. మామూలే అని వీటిని కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇటువంటివి మన జీవనశైలి మనుగడకు ముందస్తు సంకేతాలుగా పనిచేస్తాయి.

నేలపై కూర్చోలేకపోవడం

ప్రస్తుత జీవనవిధానం వల్ల నేలపై కూర్చునే అలవాటే చాలా మందికి లేదు. తినడానికి, రాయడానికి, చదవడానికి… ప్రతిపనికీ కుర్చీ-టేబుల్‌ వాడేస్తున్నారు. ఇలాంటివారు నేలపై వజ్రాసనం వేయడం కష్టం. మన జీవనశైలి, అలవాట్ల కారణంగా, నడుము దిగువ భాగంలో ముఖ్యంగా మోకాలి కీళ్ళల్లో బలం లేకపోవడంవల్ల కఠినమైన నేలమీద మోకాళ్ళపై ఒత్తిడి పెంచే భంగిమలో కూర్చోలేకపోతున్నారు.

కీళ్ళ సమస్యలు

మోకాళ్ళ, కీళ్ళ సమస్యలతో బాధపడేవారికి కూడా నేలపై వజ్రాసనం వేయడం సమస్యగానే ఉంటుంది.చీలమండలంలో బిగుతుకు పోయిన కండరాల కారణంగా కూడా దీర్ఘకాలం పాటు వజ్రాసన భంగిమలో ఉండకుండా నివారిస్తాయి.

అధికబరువు

ఉబకాయం (ఒబేసిటీ) సమస్యతో బాధపడే వారు కూడా మోకాళ్ళపై వేసే ఈ ఆసనాన్ని వేయలేరు. ఇలాంటివారికి నేలపై కూర్చోవడమే పెద్దసవాలుగా ఉంటుంది.

వంగని బిరుసైన కండరాలు కూడా కారణమే

బిరుసైన కండరాలు కలిగిన వారిలో రక్తస్రసరణ సక్రమంగా ఉండదు. అందువల్లనే కేవలం కొన్ని సెకన్లపాటు కూడా వజ్రాసనంలో కూర్చోలేరు. స్తబ్ధమైన జీవనశైలి కారణంగా కండరాల సంకోచవ్యాకోచాలు జరగకపోవడంతో ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. దిగువ శరీరం మొద్దబారడంవల్ల, మోకాలు, చీలమండ కీళ్ళ బలహీనత వల్ల, మీ ప్రస్తుత జీవనశైలి అలవాట్ల వల్ల కూడా కావచ్చు.

పైన చెప్పిన సమస్యలున్నవారు అందరూ కూడా వజ్రాసనం వేయవచ్చును. కాకపోతే దానికి ఈ చిట్కాలు ఫాలో అవ్వాలి అంతే. ఎక్కువ సమయం వజ్రాసనంలో ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

కాళ్ళను సాగదీయడం చేయాలి. కేవలం ఉదయం మాత్రమే కాకుండా సాయంత్ర సమయంలో కూడా తప్పనిసరిగా సాగదీస్తూ ఉండాలి.
నడవడం, సైకిల్‌ తొక్కడం, మెట్లు ఎక్కడం.. వంటి ఎక్సర్‌సైజ్‌లతో మీ కాళ్ళను దృఢంగా మలచుకోండి.
ఒకేసారి ఎక్కువ టైం వజ్రాసనం వేయకండి. 30 సెకన్లతో ప్రారంభించి 4, 5 సార్లు ప్రాక్టీస్‌ చేయాలి. తర్వాత కొంచెం కొంచెంగా టైం పెంచుకుంటూ అలవాటు చేసుకోవాలి.
మీ మోకాళ్ళు లేదా కాళ్ళ కింద దిండును సపోర్టుగా ఉంచి కూడా ప్రాక్టీస్‌ చేయవచ్చు.

వీటిని తరచూ ప్రాక్టీస్‌ చేయడం ద్వారా వజ్రాసనం వేయడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా వేయగలుగుతారని యోగా ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.