ప్రేమికుల దినోత్సవం జరుపుకోవాలంటే ప్రేమికులు ఉండాలి. మరి ఖాళీగా ఉన్న అమ్మాయిల పరిస్థితేంటి? అందుకే ఒంటరి మహిళల కోసం కొత్త డేటింగ్ సేవలను మొదలుపెట్టారు. ఎక్కడో తెలుసా?
ఈ వాలెంటైన్స్ డేకి కూడా మీకు బాయ్ ఫ్రెండ్ దొరకలేదా? అయితే పెద్దగా చింతించాల్సిన పనిలేదు. కేవలం మీరు అద్దెకు బాయ్ ఫ్రెండ్ ని తీసుకోవచ్చు. చదువుతుంటే కాస్త విచిత్రంగా అనిపించినా.. ఇది నిజంగా నిజం! ఒంటరి మహిళలకు సువర్ణావకాశమంటూ డేటింగ్ సేవలను మొదలు పెట్టారు.
బాయ్ ఫ్రెండ్ కోసం..
గురుగ్రామ్ కి చెందిన 31యేండ్ల టెక్కీ షకుల్ గుప్తా ఒక కొత్త ఆలోచన చేశాడు. ప్రేమ సీజన్ లో మంచి సమయాన్ని గడుపాలని కోరుకునే ఒంటరి మహిళలందరికీ ఈ సంవత్సరం వాలెంటైన్స్ డే కోసం ‘రెంట్ ఎ బాయ్ ఫ్రెండ్’ సేవలను అందచేస్తున్నాడు. సోషల్ మీడియాలో అతను పెట్టిన పోస్ట్ చాలామందిని ఆకర్షాంచింది. ఈ డేటింగ్ సేవలను అందించడానికి ఏకైక కారణం.. వాలెంటైన్ వీక్ లో ఒంటరితనాన్ని చంపడమేనని వెల్లడించాడు. ఈ ఉద్దేశాలు వాణిజ్యపరమైనవి లేదా లైంగికమైనవి కాదని కూడా స్పష్టం చేశాడు.
సోషల్ మీడియాలో..
‘బాయ్ ఫ్రెండ్ అద్దెకు ఇవ్వబడును’ అంటూ బ్యానర్ తో గుప్తా ఫోటోలకు ఫోజులిచ్చాడు. దానికి క్యాప్షన్ గా.. ‘ ఈ వి-డేలో నేను మీకు నా భుజాన్నిఇవ్వగలను. మీ స్నేహితుడిగా ఉండగలను. నేను మీ మేకప్ ప్రాక్టీస్ మోడల్ గా రెట్టింపు పని చేయగలను. మీరు విశ్రాంతి తీసుకునేటప్పుడు మీకు ఎలాంటి ఆహారాన్ని అయినా తయారు చేయగలను’ అంటూ రాసుకొచ్చాడు. తాను 5 సంవత్సరాల క్రితం డేటింగ్ సేవలను ప్రారంభించానని చెప్పాడు గుప్తా. తాను 50కి మహిళలతో డేట్స్ లో ఉన్నానని, వారితో మంచి సమయాన్ని గడిపానని కూడా అన్నాడు. అంతేకాదు.. ‘మీరు ఒంటరిగా ఉన్నట్లయితే లేదా సాంగత్యం అవసరమైతే నన్ను అద్దెకు తీసుకోవడానికి సిగ్గుపడకండి. తద్వారా నేను మీ జీవితంలో ఉత్తమ డేట్ ని మీకు ఇవ్వగలను’ అంటూ రాశాడు. అయితే అతనిని ట్రోల్ చేసేవారు అతన్ని గిగోలో అని పిలుస్తారని కూడా వెల్లడించాడు. తనని సంప్రదించిన వారిలో తాను ఎంచుకున్నవారితో డేటింగ్ చేస్తాడు. ఈ సేవలని పూర్తిగా ఉచితంగా. కేవలం మీ చిరునవ్వు ఇందుకు అద్దెగా చెల్లిస్తే చాలున్నంటాడు గుప్తా. మరి అమ్మాయిలు మీకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలా?!