‘‘ఈ వాలెంటైన్స్ డే నాటికి అంటే ఫిబ్రవరి 14నాటికి అమ్మాయిలందరికీ బాయ్ ఫ్రెండ్ తప్పనిసరిగా ఉండాలి. ఇది మీ రక్షణ కోసమే. బాయ్‌ఫ్రెండ్ లేని అమ్మాయిలను కాలేజీలోకి అనుమతించం. వారు తమ బాయ్ ఫ్రెండుతో ఇటీవల దిగిన ఫోటోను చూపించాలి. ప్రేమ పెంపొందించండి…’’ ఇది కొన్ని రోజుల్లో హల్చల్ చేస్తున్న నోటీసు. ఒడిశాలోని జగత్సింగ్పూర్ ఎస్వీఎం కాలేజీ ప్రిన్సిపాల్ పేరుతో వైరల్ అయినా ఈ నోటీసు కలకలం రేపుతోంది. చదువుకోమని చెప్పాల్సిన కాలేజీ ఇలా చెప్పిందేమిటా అని పిల్లలు, పెద్దలు తెగ విస్తుపోయారు. విషయం సదరు ప్రిన్సిపాల్ కు కూడా తెలియడంతో గుట్టరట్టయింది. ఇది ఫేక్ నోటీసు అని, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి వైరల్ చేశారని ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ పాత్ర మండిపడ్డారు. ‘మా కాలేజీ ప్రతిష్టను దెబ్బ తీయడానికి దీన్ని సృష్టించారు. పోలీసులకు ఫిర్యాదుచేశాను. విద్యాబుద్ధులు చెప్పాల్సిన అధ్యాపకులు ఇలాంటి పని ఎలా చేస్తారు? ఎవరూ దీన్ని నమ్మొద్దు,’’ అని ఆయన వెల్లడించారు. తమకు ఫిర్యాదు అందిందని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు కూడా చెప్పారు.