Vamsi cheated 1500 womens and collected Rs.50 crores
mictv telugu

హైదరాబాదులో మహా కేటుగాడు..ఆన్‌లైన్‌లో 1500 మహిళలు.. 50 కోట్లు

July 21, 2022

నగరంలో అతిపెద్ద కేటుగాడి బండారం బట్టబయలైంది. ఇటీవలే 13 మంది విడాకులు తీసుకున్న మహిళలను మోసంతో పెళ్లి చేసుకున్న ప్రబుధ్దుడు శంకర్ ఆట కట్టించేలోపే అతనికంటే భారీ స్థాయిలో మోసం చేసి డబ్బు గుంజిన వ్యక్తి కథనం వెలుగులోకి వచ్చింది. విచారిస్తే ఏకంగా 1500 మంది మహిళలను మోసం చేసి దాదాపు రూ. 50 కోట్ల వరకు దండుకున్న వైనం ఇది. గత మేనెలలో అరెస్టయిన రాజమండ్రికి చెందిన జోగాడ వంశీకృష్ణ (31) అనే బీటెక్ నిరుద్యోగి స్టోరీ ఇది. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2014లో ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన వంశీ మొదట కూకట్ పల్లిలోని హోటల్‌లో పనిచేశాడు. తర్వాత క్రికెట్ బెట్టింగులు ఆడి అది అచ్చిరాక, ట్రావెల్ ఏజెన్సీలో చేరాడు. అప్పుడే పది మంది యువకులకు ఉద్యోగాల పేరుతో మోసం చేసి అరెస్టయి జైలుకి కూడా వెళ్లి వచ్చాడు. తర్వాత రూటు మార్చి ఇన్‌స్టాగ్రామ్‌లో వివిధ పేర్లతో నకిలీ అకౌంట్లు తెరచి రెండో పెళ్లికి సిద్ధమైన మహిళలు, యువతులతో పరిచయం చేసుకునేవాడు. సామాజిక సేవ పేరుతో వారికి దగ్గరయ్యాడు. అవసరమైనప్పుడు లక్ష, రెండు లక్షలు వెంటనే ఆర్ధిక సహాయం చేస్తూ వారి ద్వారానే బాగా ప్రచారం కల్పించుకున్నాడు. డబ్బులు ఉదారంగా ఇవ్వడంతో మహిళలు కూడా ఇదంతా నిజమని నమ్మి మిగతా యువతులు, మహిళలకు ఇతని గురించి గొప్పగా చెప్పేవారు. తర్వాత అకస్మాత్తుగా డబ్బు అవసరముందని ఒక్కో మహిళ నుంచి అందినకాడికి దండుకునేవాడు. ఇలా ఆరేళ్ల నుంచి సుమారు రూ. 40 నుంచి 50 కోట్ల వరకు వసూలు చేశాడు. సైబర్ పోలీసులకు పట్టుబడిన తర్వాత అతని అకౌంటులో ఉన్న రూ. 4 కోట్ల నగదును స్తంభింపజేశారు. ప్రస్తుతం రిమాండులో ఉన్న వంశీని కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.