మంత్రి జూపల్లి కృష్ణారావు డిండి, కల్వకుర్తి తదితర ప్రాజెక్టులపై పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, ఆయనకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి శనివారం సవాలు విసిరారు. ‘ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్ లోనే ఉంటా. ఎక్కడైనా చర్చకు సిద్ధం’ అని అన్నారు.
‘జూపల్లి గతంలో చెప్పినట్టు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులతో సంబంధం లేకుండా డిండికి నీరు ఇవ్వాలని కోరుతున్నాం.. దీన్ని ఆయన వక్రీకరిస్తున్నారు. జూపల్లి సీంకు రాసిన లేఖపై చర్చకు సిద్ధమా? 2015లో పాలమూరు రంగారెడ్డిపై వచ్చిన జీవోలో ఎలాంటి మార్పూ చేయలేదని అంటున్నారు. దీనిపై చర్చకు సిద్ధమా? జూపల్లికి దమ్ముంటే 21న బహిరంగ చర్చకు రావాలి. లేకపోతే తప్పు చేసినట్టు ఒప్పుకొని పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని వంశీ డిమాండ్ చేశారు. కల్వకుర్తి ప్రాజెక్టుపై చర్చకు సిద్దంగా ఉన్నామని, దాన్ని ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరు ఏ మేరకు పనులు చేశారో, ఏ ప్రభుత్వ హయాంలో పనులు జరిగాయో చర్చకు రావాలని అన్నారు. జూపల్లి ఎలా మంత్రి అయ్యారని , ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా అవకాశం ఇస్తే ఇప్పుడు పెద్ద మనిషి అని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. తిన్నింటి వాసాలు లెక్కపెడుతూ పాలమూరుకు ద్రోహం చేస్తున్న జూపల్లి ఎలా పెద్ద మనిషి అయ్యారో కూడా చర్చకు రావాలని అన్నారు.
Jupalli , projects, Telangan, debate