ఇప్పటికే హైదరాబాద్ నగరం రెడ్ జోన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరగడం కలకలం రేపుతోంది. తెలంగాణలో కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నా.. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరగడం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ముఖ్యంగా వనస్థలిపురం ప్రాంతంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో అక్కడ వారం రోజుల పాటు సర్వం బంద్ చేయనున్నట్టు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వెల్లడించారు. హుడాసాయి నగర్, సచివాలయ నగర్ కాలనీ, ఎ, బి టైప్ కాలనీలు, ఎస్‌కేడీ నగర్, కమలానగర్‌లను రేపటి నుంచి మూసివేయనున్నారు. ఈ కాలనీలను కంటైన్మెంట్ జోన్‌లుగా ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
వారం రోజుల పాటు రైతు బజార్, పండ్ల మార్కెట్‌లను మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో వారం రోజుల పాటు అన్నీ మూతపడనున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 54 ప్రాంతాలను తెలంగాణ ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 15 కేంద్రాలు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 9 కేంద్రాలు, హైదరాబాద్ పరిధిలో 30 కంటైన్మెంట్ కేంద్రాలు ఉన్నాయి. కాగా, లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలో చిక్కుకున్న వలస కార్మికులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆన్‌లైన్ ద్వారా డిజిటల్ పాసులు కల్పిస్తున్నారు.