Vande Bharat train hit a bull in Gujarat
mictv telugu

ఈ సారి ఎద్దు వంతు.. నెలలో వందే భారత్‌కి మూడో ప్రమాదం

October 29, 2022

ముంబయ్ – గాంధీ నగర్ నగరాల మధ్య అత్యధిక వేగంతో పయనించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మరోసారి ప్రమాదానికి గురైంది. గుజరాత్‌లోని అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం 8.17 గంటలకు రైలును ఎద్దు ఢీకొట్టింది.

దీంతో డ్రైవర్ కోచ్ ముందు భాగం ఊడిపోగా, దాన్ని బాగు చేసేందుకు రైలును 15 నిమిషాలు ఆపాల్సి వచ్చింది. ఈ మేరకు రైల్వే శాఖ వివరాలను వెల్లడించింది. అటు నెల రోజుల్లో ఇది మూడో ప్రమాదం కావడం గమనార్హం. ఈ సెమీ హై స్పీడు రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించగా, అక్టోబర్ 1 నుంచి సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. కాగా, వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలపై ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. పశువులు ఢీ కొట్టే ఘటనలను తప్పించలేమని, రైలు డిజైనింగ్ సమయంలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు రైలు పట్టాలకు ఇరు వైపులా ఫెన్సింగ్ ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు.