వందేమాతరాన్ని ఖూనీ చేసిన బీజేపీ నేత - MicTv.in - Telugu News
mictv telugu

వందేమాతరాన్ని ఖూనీ చేసిన బీజేపీ నేత

October 31, 2017


వందేమాతర గేయాన్ని ఆరెస్సెస్, బీజేపీ నేతలు ఎంతో గౌరవిస్తుంటారు. ప్రతి సందర్భంలో దాన్ని పాడుతుంటారు. ఇటీవల ఈ గేయాన్ని అన్ని స్కూళ్లలో తప్పనిసరి చేయాలడే డిమాండ్లు కూడా వస్తున్నాయి బీజేపీ వైపు నుంచి. అయితే ఆ పాటను అంతగా గౌరవించే ఆ పార్టీకి ఇప్పుడు ఒక స్వపక్ష నేత నేత వల్ల చేదు అనుభవం ఎదురైంది. బీజేపీ ప్రతినిధి నవీన్ కుమార్ సింగ్ వందేమాతరాన్ని తప్పుల తడకగా పాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యి నవ్వులు పూయిస్తోంది.  అసలు గేయంలోని పదాలకు, ఆయన పాడుతున్న పదాలకు బొత్తిగా తేడా లేకపోవడంతో నెటిజన్లు ఘోరమైన సటైర్లు వేస్తున్నారు. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఆయన ఈ పాట పాడారు.

నవీన్, ఆలిండియా ముస్లిం ప‌ర్స‌న‌ల్ లా ప్ర‌తినిధి ముఫ్తీ ఇజాజ్ అర్ష‌ద్ ఖాస్మీ తదితరుల మధ్య ఈ చర్చ నడిచింది. చర్చ కాస్తా మాటల యుద్ధంగా మారడంతో.. మీకు మీ సిద్ధాంతాలపై చిత్తశుద్ధి ఉంటే వందేమాత‌రం గేయం పాడాలంటూ నవీన్ కుమార్‌ను ముఫ్తీ రెచ్చ‌గొట్టాడు. మొదట కాస్త నసిగినా, తర్వాత ఒప్పుకున్నాడు నవీన్. అయితే తనతో కలిసి పాడాలని ముఫ్తీకి షరతు పెట్టాడు. ముఫ్తీ అందుకు ఒప్పుకున్నాడు. నవీన్ వందేమాతరం అని ఎత్తుకున్నాడు. అయితే తర్వాత ఏం పాడాలో తెలియక ఫోన్లో చూసి పాడ్డానికి యత్నించాడు. అప్పటికీ పదాలు సరిగ్గా పలకలేక తడబడ్డాడు. పలికిన పదాలనే మాటిమాటికీ పలికాడు.

‘సన్సాయామ్..మల్యాం..

సుబ్రత్ జోత్సం, పుల్కిత్యాం,

పుల్కిస్త, సుమిత, దుమల్ సునామీ..

సుబాసిన్, సుమత్ర బుల్సుమాని.. ’

అని ఏమాత్రం సరిపోలకుండా అర్థం పర్థం లేకుండా పాడాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవీన్ పై మండిపడుతున్నారు. పాడడం చేతకాకపోతే గమ్మునుండాలి గాని ఇలా వదరడం ఏమిటని, ఇదేనా దేశమాతపై మీ భక్తి అని తిడుతున్నారు. బీజేపీ నేతలు వందేమాతర గేయాన్ని ఖూనీ చేయడం ఇది తొలిసారి కాదు. గతంతో బ‌ల్దేవ్ సింగ్ అవుల‌క్ కూడా ఈ పాటపాడ్డానికి  తెగ ఇబ్బంది పడిపోయాడు.