వర్మకు వాణీవిశ్వనాథ్ హెచ్చరిక

రామ్‌గోపాల్‌ వర్మ తీస్తున్నలక్ష్మీస్‌ ఎన్టీఆర్‌పై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. రేపోమాపో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న నటి వాణి విశ్వనాథ్ శుక్రవారం వర్మపై విరుచుకుపడ్డారు. లక్ష్మీపార్వతి కోణంలో తీస్తున్న వర్మ సినిమాపై తమకు చాలా అనుమానాలు ఉన్నాయని, ఆయన ఎన్టీఆర్ జీవితాన్ని వక్రీకరించే అవకాశముందని వాణి శుక్రవారం  మీడియాతో అన్నారు.

‘ఎన్టీఆర్.. దేవుడిలాంటి నటుడని తెలుగువాళ్లు చెబుతారు. రాముడిగా, కృష్ణుడిగా ఆయన ప్రజల్లో ముద్రవేసుకున్నారు. ఆయనపై బాలకృష్ణ తీస్తున్న సినిమా గొప్పగా ఉంటుంది. కానీ వర్మ సినిమాపై డౌట్లున్నాయి. శ్రీరాముడిపై సినిమా తీస్తూ రావణుడు అని, కృష్ణుడి సినిమా తీస్తూ కంసుడు అని, గాంధీ సినిమా తీస్తూ గాడ్సే అని పేరు పెట్టలేరు కదా. కానీ వర్మ తీరు మాత్రం అలాగే ఉంది’ అని విమర్శించారు. అన్నగారి సినిమా తీయాలనుకుంటే ఆయన కేంద్రంగానే తీయాలిగాని లక్ష్మీపార్వతి కోణంలో తీయడమేంటని ప్రశ్నించారు. వర్మ ఎన్టీఆర్‌కు చెడ్డపేరు తెచ్చే తన ప్రయత్నాన్ని మానుకోవాలని, లేకపోతే అతని ఇంటి ముందు ధర్నా చేస్తానని వాణి హెచ్చరించారు. వాణి ఎన్టీఆర్ నటించిన సమ్రాట్ అశోక సినిమాలో నటించారు. వైఎస్సార్ సీపీ నాయకురాలి రోజాకు కౌంటర్లు వేసేందుకు టీడీపీ వాణిని చేర్చుకుంటోంది.

SHARE