మూడో భర్తనూ వదిలేసిన 'దేవి' నటి! - MicTv.in - Telugu News
mictv telugu

మూడో భర్తనూ వదిలేసిన ‘దేవి’ నటి!

October 20, 2020

nvmmgh

సినిమా పరిశ్రమలో నటీనటులు, దర్శకనిర్మాతల్లో రెండు పెళ్ళిలు చేసుకున్నవారు ఎందరో ఉంటారు. కొందరు మూడు పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. అలాంటి వారిలో సీనియర్ నటీనటులు విజయ్ కుమార్-మంజుల దంపతుల వారసురాలు వనిత వచ్చి చేరారు. ‘దేవి’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన వనిత.. సినిమాల్లో వివాదాల వల్లే ఎక్కువ పాపులర్ అయ్యారు. ఇటీవలే ఆమె మూడో పెళ్లి చేసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆమె మూడో పెళ్లి కూడా నిలవలేదని తెలుస్తోంది. 

వనిత జూన్ 27న పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్‌లో క్రిస్టియన్ వివాహ పద్దతిలో వీరి పెళ్లి జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తక్కువ మంది అతిధులను ఆహ్వానించారు. ఇది పీటర్‌కు రెండో పెళ్లి. అతనికి గతంలో హెలెన్ అనే యువతితో వివాహం అయింది. అతనికి ఇద్దరు పిల్లలున్నారు. వనిత తన మొదటి భర్త ఆకాష్‌తో 2007లో విడాకులు తీసుకుంది. వీరికి ఒక కొడుకు, కూతురు సంతానం. ఆ తర్వాత ఆనంద్ జయ్ రాజన్ అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకుంది. వారి మధ్య కూడా విభేదాలు రావడంతో 2012లో అతనితో విడాకులు చేసుకుంది. వీరికి ఓ కూతురు సంతానం. 

ముగ్గురు పిల్లలున్న వనిత మూడో పెళ్లి చేసుకోవడాన్ని కొందరికి నచ్చలేదు. దీంతో వనితపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. నటి లక్ష్మీ రామకృష్ణన్‌.. వనిత మూడో పెళ్లి గురించి ట్వీట్ చేశారు. ‘ఇప్పుడే వనిత పెళ్లి వార్త చూశాను. ఇప్పటికే వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన వ్యక్తిని, మొదటి భార్యకు విడాకులు ఇవ్వని వ్యక్తిని ఎలా వివాహం చేసుకున్నారు? బాగా చదువుకున్న, సెలబ్రిటీ అయినవారు ఇలాంటి పెద్ద తప్పు ఎలా చేశారు. అయినా పెళ్లి జరిగిపోయే వరకు పీటర్ మొదటి భార్య ఎందుకు ఆగారు? ముందే ఎందుకు ఆపలేదు?’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో వనిత ఆమెకు సోషల్ మీడియాలో గట్టి వార్నింగ్ ఇచ్చారు. తన వ్యక్తిగత జీవితం గురించి కామెంట్లు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. ‘ఇద్దరు మనషులు ఎందుకు విడిపోతారో, ఎందుకు విడాకులు తీసుకుంటారో నీకు తెలుసా? ఈ విషయంతో నీకెలాంటి సంబంధమూ లేదు. నువ్వు ఇందులో వేలు పెట్టడం మంచిది కాదు. నేను వేరెవరి వ్యక్తిగత జీవితాల్లోనూ తలదూర్చడం లేదు. దయచేసి నీ పని నువ్వు చూసుకో’ అంటూ వనిత విరుచుకుపడ్డారు. 

తనకు విడాకులు ఇవ్వకుండానే పీటర్ రెండో పెళ్లి చేసుకున్నాడని అతని భార్య హెలెన్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఓ కొలిక్కి రాకముందే వనిత-పీటర్‌లు విడిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ జంట గోవా ట్రిప్‌కు వెళ్లారట. ఆ ట్రిప్‌లో మద్యం తాగి పీటర్ వనితని కొట్టాడని వార్తలు వస్తున్నాయి. చెన్నైకి తిరిగి రాగానే వనిత కోపంతో పీటర్‌ను ఇంటి నుంచి తరిమేసిందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గోవాలో జరిగిన గొడవ విషయాన్ని నిర్మాత రవీంద్రన్ చంద్రశేఖరన్ ధ్రువీకరించారు.