Varanasi court says will hear Hindu side's plea on worship in Gyanvapi mosque complex
mictv telugu

జ్ఞానవాపి వివాదంపై కోర్టు ఆదేశాలు.. వారికే అనుకూలం

September 12, 2022

దేశంలో చర్చనీయాంశమైన జ్ఞానవాపి మసీదు వివాదంపై వారణాసి జిల్లా కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. మసీదు ప్రాంగణంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలన్న పిటిషన్పై సానుకూలంగా స్పందించింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. మసీదు లోపల సర్వేకు దారితీసిన మహిళల పిటిషన్‌పై కోర్టు విచారణ కొనసాగుతుందని జిల్లా జడ్జి ఎకె విశ్వేషా తెలిపారు.తదుపరి వాదనలు సెప్టెంబర్ 22న విననున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ముస్లిం పక్షాలు దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది.

అంతకుముందు మీడియాతో మాట్లాడిన హిందూ వర్గాల తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్.. కోర్టు నిర్ణయం తమకు అనుకూలంగా వస్తే ఆ ప్రాంతంలో ఏఎస్ఐ సర్వే నిర్వహించాలని కోరతామని చెప్పారు. శివలింగానికి కార్బన్ డేటింగ్ పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కోర్టు నిర్ణయం నేపథ్యంలో వారణాసిలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. కీలక ప్రాంతాల్లో గస్తీ వాహనాలను మోహరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు క్విక్ రియాక్షన్ బృందాలను రంగంలోకి దించారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలిగినా కఠిన చర్యలు తీసుకుంటామని వారణాసి కమిషనర్ ఏ సతీశ్ గణేశ్ స్పష్టం చేశారు.