కామాంధుల పనిపట్టే ఖతర్నాక్ లిప్‌స్టిక్.. - MicTv.in - Telugu News
mictv telugu

కామాంధుల పనిపట్టే ఖతర్నాక్ లిప్‌స్టిక్..

January 9, 2020

Lipstick Gun.

ఆపదలో ఉన్న మహిళల కోసం ఈ లిప్‌స్టిక్‌ను స్పెషల్‌గా తయారుచేశారు. దీనిని లిప్‌స్టిక్ గన్ అంటారు. ఇది మహిళల అందానికే కాకుండా ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన శ్యామ్‌ చౌరేసియా అనే ఔత్సాహిక శాస్త్రవేత్త దీనిని తయారుచేశాడు. ఇది లిప్‌స్టిక్‌ను పోలి ఉండే లిప్‌స్టిక్‌ గన్‌. దీన్ని నొక్కితే పేలుడు శబ్ధం వినిపిస్తుంది. అంతేకాకుండా నేరుగా ఎమర్జెన్సీ నంబర్‌ 112కు కనెక్ట్‌ అవుతుంది. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై ప్రమాదంలో ఉన్న మహిళకు సాయపడతారు. 

దీని ఆవిష్కర్త శ్యామ్‌ మాట్లాడుతూ.. ‘మహిళలు ప్రమాదకర స్థితిలో పడ్డప్పుడు ఈ లిప్‌స్టిక్‌పై ఉన్న బటన్‌ నొక్కితే చాలు. వెంటనే పోలీసులకు ఫోన్‌ వెళుతుంది. దీనికి చార్జింగ్‌ సదుపాయంతో పాటు బ్లూటూత్‌ ద్వారా మొబైల్‌ ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు. రోజురోజుకు మహిళలపై పెరుగుతున్న అరచకాలను అరికట్టాలనే ఉద్దేశంతోనే దీనిని తయారు చేశాను. మహిళలు అందరూ తమ వెంట దీన్ని తీసుకెళ్లవచ్చు. రక్షణ పొందవచ్చు. ఈ పరికరాన్ని తయారు చేయడానికి నాకు సుమారు ఒక నెల సమయం పట్టింది. కేవలం రూ.600 మాత్రమే ఖర్చయ్యాయి. త్వరలోనే ఈ లిప్‌స్టిక్‌ గన్‌పై పేటెంట్‌ హక్కులు తీసుకుంటాను’ అని తెలిపాడు. 

కాగా, ఈ లిప్‌స్టిక్ గన్‌ను తొలిసారి బనారస్‌ హిందూ యూనివర్సిటీకి చెందిన షెఫాలి రాయ్‌ ప్రయోగించింది. దీనిని వెంట తీసుకెళ్లడం చాలా సౌకర్యంగా ఉందని వెల్లడించింది. ఈ గన్‌ చేసే శబ్ధం ఎంతో భయాన్ని కల్పించేదిగా ఉందని.. ఇది మీ వెంట ఉంటే మిమ్మల్ని ఎవరూ అనుమానించరు అని తెలిపింది. అందరూ దీన్ని మామూలు లిప్‌స్టిక్‌గా భ్రమపడతారని చెప్పింది.