ఈ సంక్రాంతికి టాలీవుడ్ అగ్రహీరోలతోపాటు.. పోటీలో తాము కూడా ఉన్నామంటూ మొదటి నుంచి హడావుడి చేస్తున్న దిల్ రాజు ‘వారసుడు’ టీమ్ వెనక్కి తగ్గింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ దళపతి విజయ్ నటించిన ఈ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమాను ఈనెల 14న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. అయితే తమిళ వర్షన్ లో మాత్రం జనవరి 11 న ఈ సినిమా రిలీజ్ కానుంది.
పండుగ సందర్భంగా విడుదల కాబోయే ఈ సినిమాకు టిక్కెట్లు ఇంకా అందుబాటులో లేకపోవడంతో సినీ ప్రేక్షకులు.. అసలు వారసుడు రిలీజ్ ఉంటుందా అని అయోమయానికి గురయ్యారు. తాజాగా నిర్మాత దిల్ రాజు.. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ చిత్రాలను దృష్టిలో పెట్టుకుని తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. అంతేకాదు.. వారసుడు సినిమాపై తమకు 100 శాతం నమ్మకం ఉందని.. గతంలో తమ బ్యానర్ నుంచి సంక్రాంతికి వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి, ఎఫ్ 2 సినిమాల మాదిరిగా వారసుడు కూడా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ కథా చిత్రమే అయినా ఈ మూవీలో ఓ కొత్త పాయింట్ ఉంటుందని.. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ ఈ పాయింట్‌ను మాత్రమే గుర్తుంచుకుంటారని దిల్ రాజు అన్నారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీలో విజయ్ సరసన రష్మిక హీరోయిన్గా నటించగా.. శ్రీకాంత్, శరత్‌కుమార్, కిక్ శ్యామ్, సంగీత , జయసుధ, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని నెటిజన్ల టాక్.